ప్రధాని కువైట్ పర్యటన..నెటిజన్ రిక్వెస్ట్..
ప్రధాని నరేంద్రమోదీ కువైట్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 101 సంవత్సరాల వయసు గల తన తాతను కువైట్‌లో కలవాలని శ్రేయ జునేజా అనే నెటిజన్ రిక్వెస్ట్ చేశారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, ఆయనను కలిసేందుకు ఎదురు చూస్తున్నానని, కువైట్‌లోని ప్రవాస భారతీయుల ఆత్మీయ సమావేశంలో ఆయనను కలుస్తానని పేర్కొన్నారు. శ్రేయ తాతగారు 101 ఏళ్ల మంగళ్ సేన్ హండా గతంలో ఇండియన్ ఫారిన్ సర్వీసులో పనిచేశారు. ఆయనకు ప్రధాని మోదీ అంటే ఎంతో అభిమానం అని, ఆయన వివరాలను ప్రధాని కార్యాలయానికి పంపించానని పేర్కొన్నారు శ్రేయ. 2023లో ఆయన 100 వ పుట్టినరోజునాడు ప్రధాని మోదీ ఆయనకు ఒక లేఖను పంపారు. దానిలో ఆయన ఐఎఫ్‌ఎస్ అధికారిగా ఉన్నప్పుడు భారత దౌత్య సంబంధాలను ఎంతో బాగా నెరవేర్చారని పేర్కొన్నారు. ఈ లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారాయన. భారత ప్రధాని కువైట్‌ను సందర్శించడం 43 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

