లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్నదానిపై క్లారిటీ వస్తోంది. 2014లో వడోదర, వారణాసి నుంచి, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయగా, ఈసారి ప్రధాని మోడీ తెలంగాణా నుంచి బరిలో దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి సానుకూలత ఉన్నప్పటికీ, స్థానిక నాయకత్వం అందిపుచ్చుకోవడం లేదన్న భావనలో ఉన్న మోదీ.. తాను డైరెక్ట్ గా రేసులో దిగితే ఈక్వేషన్లు మారతాయని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ మల్కాజ్‌గిరి నుంచి సికింద్రాబాద్ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కూడా.

అదే సమయంలో మల్కాజ్ గిరి సెగ్మెంట్‌లోనూ బీజేపీ బలంగా ఉంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధించినప్పటికీ కేవలం ఆ పార్టీకి 64 స్థానాలు మాత్రమే లభించాయి. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి 39, బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి 7 స్థానాలు దక్కాయి. విపక్షాలకు 53 స్థానాలు దక్కినప్పటికీ ఒక స్థానం కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ దక్కించుకొంది. లోక్ సభ ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా రాజకీయాలు మారతాయన్న భావన ఉంది. ఇటీవల ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో మరిన్ని సీట్లను గెలుచుకోవాలని బీజేపీ భావించినప్పటికీ సాధ్యం కాలేదు. కేవలం గోషామహల్ సీటుతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఐతే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నప్పటికీ ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పుంజుకొంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో 15 శాతం మేర ఓట్లను సాధించిన ఆ పార్టీ 8 సీట్లలో విజయం సాధించి సత్తా చాటింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక్కడ్నుంచి రాహుల్ గాంధీని ఎంపీగా బరిలో దించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నల్గొండ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యనేతలు తెలంగాణ నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది.

