మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రిలో ప్రధాని మోదీ సభ
వచ్చే సోమవారం అంటే ఈనెల 13న ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం అటు వైసీపీ, ఇటు ఎన్డీఏ పక్షాలు హోరాహోరీ తలపడుతున్నాయ్. ఓవైపు జగన్, మరోవైపు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తుండగా ఇప్పుడు ఆ ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు జతకడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఏపీ సీఎస్, డీజీపీని మర్చాలంటూ టీడీపీ గట్టిగా వాదన విన్నిస్తున్నప్పటికీ అంతగా పట్టించుకోని బీజేపీ పెద్దలు నిన్న హోం మంత్రి అమిత్ షా, హిందూపురం పర్యటన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది.

ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్‌పై పెద్దగా బీజేపీ కేంద్రపెద్దలు విమర్శలు చేసిన దాఖలాలు లేవు. నిన్న కొద్దిగా అమిత్ షా విమర్శలు గుప్పించారు. అది కూడూ ఇంగ్లీష్ భాషపైనా, అమరావతి రాజధానిపైనా ఎక్కువగా ఆరోపణలు చేశారు. అదే సమయంలో జగన్ సైతం అటు బీజేపీ కేంద్ర పార్టీనిగానీ, ప్రధాని మోదీపై విమర్శలు లేకుండానే ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా ప్రచారం ఏపీ సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా సాగుతోంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రెండు సభల్లో పాల్గొననున్నారు. రాజమండ్రి నగరానికి దూరంగా వేమగిరిలో జాతీయ రహదారి పక్కన 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ జరగనుంది.

ఈ సభలో మోదీతోపాటుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి పాల్గొననున్నారు. ఈ సభ వేదికపై ఐదుగురు ఎంపీ అభ్యర్థులు, 7గురు ఎమ్మెల్యే అభ్యర్థులు కుర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఐతే అనుకోని టెక్నికల్ సమస్యల వల్ల చంద్రబాబు, రాజమండ్రి సభకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు హెలికాప్టర్ సమస్య రావడం వల్ల ఆయన అనకాపల్లి సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధాని మోదీ సాయంత్రం అనకాపల్లిలో సీఎం రమేష్ నిర్వహించే సభలో పాల్గొంటారు. మంగళగిరి సభలోలా జగన్ పై ప్రధాని మోదీ పైపై విమర్శలు చేస్తారా లేదంటే కీలక ఆరోపణలు చేసే అవకాశముందా అన్నది చూడాలి. ఒకవేళ మోదీ నిప్పులు చెరిగితే, అటువైపు నుంచి కూడా అదే విధంగా వేడి మొదలయ్యే అవకాశం ఉందని కూడా సమాచారం.