Home Page SliderNational

జీ-20 సదస్సులో ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం

ఢిల్లీలో జరుగుతున్న జీ-20 సదస్సులో భారత ప్రధాని మోదీ ఇటీవల ప్రపంచ పరిణామాలపై ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రపంచ సంక్షోభ పరిస్థితులను గురించి ప్రస్తావించారు. ఇటీవల జరుగుతున్న ప్రతికూల సంఘటనల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతోందని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు వంటి వరుస  సంఘటనలతో ప్రపంచ స్థాయి సంస్థల వైఫల్యం తేటతెల్లమవుతోందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ప్రజలకు నిత్యావసరాలైన ఇంధనం, ఆహార భద్రతపై కూడా భరోసా కల్పించలేకపోతున్నాయన్నారు. ఈ క్రమంలో అప్పులపాలవుతున్నాయని పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్‌కు ధనిక దేశాలు కారణమవుతున్నాయని, అందుకే దక్షిణాది దేశాల తరపున తమ ప్రభుత్వం గళం వినిపించే ప్రయత్నం చేస్తోందన్నారు. జీ20 దేశాలు కలిసికట్టుగా ఏకమై అభివృద్ధి వైపు ముందడుగు వేయాలని హితవు చెప్పారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరుగుతున్న ఈ  జీ20 సదస్సుకు భారత్ అధ్యక్షహోదాను వహిస్తోంది. ఈ గ్రూప్‌తో పాటు భారత్ ఆహ్వానంపై మిత్రదేశాలు కూడా పాల్గొన్నాయి. ఉక్రెయిన్ అంశాన్ని కూడా కీలకంగా ప్రస్తావించనున్నారు.