ప్రధానిమోదీ 74వ జన్మదినం..ప్రముఖుల శుభాకాంక్షలు
భారత ప్రధాని నరేంద్రమోదీ తన 74వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మూడవసారి ప్రధానిగా ఆయన తన పుట్టినరోజును జరుపుకోవడంతో ప్రముఖుల నుండి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని ప్రముఖులంతా సామాజిక మాధ్యమాలలో తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లో జన్మించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వ్యక్తిత్వం, పనితీరుతో దేశప్రతిష్టను పెంచారని, మీ నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా త్వరలోనే మార్చగలరని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన శుభాకాంక్షలలో పేదల సంక్షేమం విషయంలో ప్రధాని మోదీ రికార్డులు సృష్టించారన్నారు. దేశప్రతిష్టను సముద్రపు లోతు నుండి అంతరిక్షం వరకూ విస్తరించారని కొనియాడారు. మోదీ మార్గదర్శకత్వంలో పని చేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.