హైటెక్ హాస్పటల్స్ ప్రారంభించిన ప్రధాని మోదీ
తమ ప్రభుత్వం పాత వ్యవస్థలను మార్చేందుకు సర్జరీ చేసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో 1,275 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సివిల్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో కొన్ని దేశాల్లో ఒక్క వ్యాక్సిన్ డోసు కూడా దొరక్క జనం అల్లాడిపోయారని, మరికొన్ని దేశాల్లో ప్రజలకు నాలుగైదు డోసులు లభించాయని, ఈ విషయం తనను బాధించిందని అన్నారు. అందువల్లే జీ 20 సదస్సులో తాను ONE EARTH-ONE HEALTH అని పిలుపునిచ్చానని గుర్తు చేసుకున్నారు.

పాతికేళ్ల క్రితం గుజరాత్‌ను అనేక వ్యాధులు బాధించాయని, ఆరోగ్య సంరక్షణలో వెనుకబాటు, విద్యుత్ కొరత, పరిపాలనా లోపం, శాంతిభద్రతల సమస్య ఉండేవి. ఈ వ్యాధులన్నింటికీ మూలకారణం ఓటు బ్యాంకు రాజకీయమేనని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత వ్యవస్థను మార్చే సర్జరీలు చేశానని వక్కాణించారు. అలసత్వం, అవినీతికి అడ్డుకట్ట వేయడమే ఆ సర్జరీ అని పేర్కొన్నారు. మోదీ 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మానవ వనరులు, మౌలికసదుపాయాలు, ఆవిష్కరణలు, కొత్త ఆసుపత్రుల నిర్మాణం, సంరక్షణ మొదలైన విధానాలతో గుజరాత్ రూపురేఖలే మారిపోయాయని తెలియజేశారు. మనుషులకు మాత్రమే కాకుండా జంతువులకు కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందని వినమ్రంగా చెప్పగలనన్నారు. గుజరాత్ వైద్యవ్యవస్థలను మరింత మెరుగు పరిచేందుకు వైద్యులు సూచించిన మెడిసిన్, సర్జరీ, సంరక్షణ అనే మూడు అంశాలపై బాగా కృషి చేసామన్నారు. ఈ మూడింటికీ కత్తెర వేయడమే నా సర్జరీ స్టైల్ అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ.

