బీజేపీ ఎంపీలపై పూజారి ఫిర్యాదు
జార్ఖండ్ లోని బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, నిశికాంత్ దూబేలపై ఒక దేవాలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆలయంలో పూజలు జరుగుతున్న వేళ ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఎంపీలు ఇద్దరూ నిర్లక్ష్యంగా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఆలయ పూజరి.. ఎంపీల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పూజారి చెప్పిన వివరాల ప్రకారం.. శ్రావణమాసం నేపథ్యంలో బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, నిశికాంత్ దూబే ఆగస్టు రెండో తేదీన జార్ఖండ్ దేవ్ గఢ్ లోని బాబా వైద్యనాథ్ ఆలయానికి వెళ్లారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. ఆలయంలోకి వీఐపీ, వీవీఐపీల ప్రవేశాలను నిలిపివేశారు. కానీ, బీజేపీ ఎంపీలు ఇద్దరు మాత్రం ఇవేవీ లెక్క చేయలేదు. భద్రతా సిబ్బంది అడ్డు చెప్పినప్పటికీ.. లెక్కచేయకుండా ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేశారు. ఏకంగా గర్భ గుడిలోకి ప్రేవేశించి పూజలు జరిపారు. వారి ప్రవర్తనతో గుడిలో ఉన్న పూజారులు సైతం ఖంగుతిన్నారు. ఈ క్రమంలో ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆలయ పూజారి కార్తీకనాథ్ ఠాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో ఎంపీలు బలవంతంగా ప్రవేశించి, భద్రతా సిబ్బందితో వాదనకు దిగినట్లు తెలిపారు. మత సంప్రదాయం, భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగి భక్తులు భయాందోళనలకు గురయ్యారని పేర్కొన్నారు. దీనితో వీరిద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ నిశికాంత్ దూబే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పూజలు చేసినందుకు తనపై కేసు నమోదు చేశారని, ఇప్పటివరకూ 51 కేసులు నమోదు చేశారని తెలిపారు. శనివారం అరెస్టయ్యేందుకు స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్తానని వెల్లడించారు. మరో ఎంపీ మనోజ్ తివారీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.