మునుగోడు ప్రచారంలో ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం..!
నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం మునుగోడు ఎన్నికల ప్రచారంపై పడనుందా..? ఇంతకాలం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి చుట్టూ తిరిగిన ప్రచార సరళి ఇక నుంచి మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో డీలింగ్ పైకి మళ్లనుందా..? మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్, బీజేపీ నువ్వా.. నేనా.. అన్నట్లు పోరాడుతున్నాయి. అంతర్గత పోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం సిట్టింగ్ స్థానంపై ఆశలు ఎప్పుడో వదిలేసుకుంది. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం ప్రభావం చూపుతుందని భయపడుతున్నాయి.

తెరమరుగైన మునుగోడు అభివృద్ధి..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం టీఆర్‌ఎస్ డ్రామా అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, సిట్ లేదా సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇలాంటి కుట్ర పన్నిందని.. ఇక్కడ మాత్రం రివర్స్ అయిందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ హామీ తెరమరుగైంది. బీజేపీ విడుదల చేసిన మునుగోడు మేనిఫెస్టోనూ ఓటర్లు మర్చిపోయారు. మునుగోడులో ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వివాదాన్నే ప్రచారంలో ప్రధాన అజెండాగా చేయాలని టీఆర్‌ఎస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి.

ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం మునుగోడులో తమకు మేలు చేస్తుందని బీజేపీ దావా చేస్తోంది. ఈ వివాదంతో బీజేపీ బండారం బట్టబయలైందని, మునుగోడు ప్రజలు తమకే అండగా నిలుస్తారని టీఆర్‌ఎస్ చెబుతోంది. ఈ ఎన్నికపై ఎంతోకొంత ప్రభావం పడుతుందని.. అయితే ఎవరికి లాభం చేకూరుతుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మునుగోడు ఓటర్ల మనోగతం మాత్రం ఉప ఎన్నికల ఫలితం వచ్చే నెల 6వ తేదీన బయట పడనుంది.