Home Page SliderInternational

అంతర్జాతీయ వేదికపై జక్కన్నకు ప్రతిష్ఠాత్మక అవార్డు

మన తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి అంతర్జాతీయ వేదికలకెక్కింది. ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు మన జక్కన్న రాజమౌళిని వరించింది. ఈ అవార్డును ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఈ కార్యక్రమం న్యూయార్క్ లో జరిగింది. ఈ వేడుకలో రాజమౌళి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.  భారతీయ సంప్రదాయ దుస్తులైన ధోతీ- కుర్తాలో హాజరయ్యారు. సూపర్ హిట్ మూవీ RRR చిత్రానికి ఈ అవార్డును అందుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు, ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు..

వేదికపై రాజమౌళి మాట్లాడుతూ ఈ వేదికపై అందరి ముందూ మాట్లాడడం కంగారుగా ఉందన్నారు. సినిమా అనేది దేవాలయం వంటిదని, తాను ప్రతీ సీన్ చిత్రీకరించేటప్పుడు ఈ సీన్ థియేటర్‌లో చూసేటప్పుడు ఎలా ఉంటుందని ప్రేక్షకుడిగా ఊహించుకుంటానన్నారు. ఈ సినిమాపై భారతీయులే కాక విదేశీయులు కూడా అభిమానం చూపించారని, న్యూయార్క్‌, చికాగోలలో థియేటర్లలో వారి ఆనందాన్ని చూసానన్నారు.

తాను నిర్మించే సినిమాలలో తన కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారని, తన భార్య కాస్టూమ్ డిజైనర్‌గా, అన్న సంగీత దర్శకుడిగా పని చేస్తూ తనకు అండగా ఉంటారని తెలియజేశారు. తనను ఎల్లప్పుడూ వారందరూ ప్రోత్సహిస్తూ ఉంటారని ఆనందం వ్యక్తం చేశారు. తన సినిమా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు కూడా అభినందనలు తెలియజేశారు.