మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే
మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటన కారణంగా అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యసభలో కూడా ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఇదే విషయమై తన వాదనలు వినిపించారు. తాము రూల్ 267 ప్రకారం నోటీస్ ఇచ్చామని, దీనితో పార్లమెంట్‌లో జరగవలసిన ఇతర అంశాలను పక్కన పెట్టి, మణిపూర్ ఘటనపై చర్చ జరగాల్సిందేనన్నారు. ఈ అంశంపై కేవలం అరగంట చర్చ సరిపోదని, మణిపూర్ సీఎం తక్షణమే రాజీనామా చేయాలన్నారు. అక్కడ ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, మణిపూర్ కాలిపోతోందని, రాష్ట్రపతి పాలన విధించాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఈ రూల్ నెంబర్ 267 ప్రకారం ప్రతిపక్షాలు ముఖ్య అంశాలపై నోటీసులు జారీ చేయవచ్చు. ఆరోజు జరగాల్సిన అంశాలను పక్కన పెట్టి దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యను గురించి చర్చకు అంగీకరించవచ్చు. దీనిని రాజ్యసభ ఛైర్మన్ అంగీకరించవలసి ఉంటుంది. దీనితో ప్రతిపక్షాలు ఈ రూల్ ప్రకారం మణిపూర్ ఘటన గురించి విచారించాలంటూ నోటీసులిచ్చాయి. అయితే ఇది ప్రతిపక్షాలు సభకు అంతరాయం కలిగించే సాధనంగా మారిందని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. దీనితో ప్రతిపక్షం మండిపడుతోంది. ఈ రూల్‌ను పాటించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు.