టీచర్‌గా మారిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటితో రెండేళ్ల పదవీకాలం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె టీచర్‌గా మారారు. న్యూఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయవిద్యాలయలో కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. 9 వ తరగతి విద్యార్థులతో గ్లోబల్ వార్మింగ్, పర్యావరణం వంటి అంశాలు, సమస్యలపై చర్చించారు. పర్యావరణ పరిరక్షణకు వివిధ మార్గాలను విద్యార్థులకు సూచించారు. అడవుల పెంపకం, నీటి పొదుపు గురించి ప్రాముఖ్యతను వివరించారు. ఎక్కువ మొక్కలు నాటాలని, వర్షపు నీటి సంరక్షణ చేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రతీ విద్యార్థి తమ తల్లి పేరుతో ఒక మొక్కను, తమ పుట్టిన రోజునాడు ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. వాయుకాలుష్యం గురించి ఆమె ప్రస్తావించారు. విద్యార్థులతో సంభాషించడం, వారితో గడపడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్రపతి ప్రకటించారు.


 
							 
							