కోకాపేట తరహాలో బుద్వేల్‌లో వేలంకు సిద్ధం
గురువారం జరిగిన వేలంలో కోకాపేట భూములు రికార్డు ధరలకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌కు కూడా ఇదే తరహాలో భారీ లాభాలు ఆర్జించే దిశగా అడుగులు వేస్తోంది. అక్కడ కూడా భూముల వేలంపాటకు నోటిఫికేషన్ జారీ చేసింది. మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని HMDA ద్వారా అమ్మకాలు జరపాలని నిర్ణయించుకున్నారు. బుద్వేల్‌లో మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. ఇక్కడ ఒక్కో ప్లాటు విస్తీర్ణం 3.47 ఎకరాల నుండి 14.33 ఎకరాల విస్తీర్ణం వరకు ఉంది. ఇక్కడ ఎకరానికి కనీస ధర 20 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. నిన్న జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో 100 కోట్లకు కూడా ఎకరం అమ్ముడు పోయింది. దీనితో ఈ నెల 10వ తేదీన ఇక్కడ ఈ-వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. బుద్వేల్ భూములు ఎకరాకు సగటున 30 కోట్ల రూపాయలకైనా అమ్ముడుపోతాయని ప్రభుత్వ అంచనా. ఆరవ తేదీన ప్రీబిడ్ సమావేశం జరగనుంది. 8 వతేదీ సాయంత్రం వరకూ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది.