ప్రజ్ఞానంద రాక్స్..మాగ్నస్ కార్ల్‌సన్ షాక్స్
“పిట్ట కొంచెం కూత ఘనం” అన్న చందంగా ప్రజ్ఞానంద తన ఆటలో ప్రతిభ కనబరుస్తున్నాడు. ప్రజ్ఞానంద తన ఆటలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ..ప్రత్యుర్దులకు చెమట్లు పట్టిస్తున్నాడు. ఈ మేరకు భారత యువ ఆటగాడు ప్రజ్ఞానంద ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సన్‌కు మరోసారి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం మియామీలో ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ కోసం పోటీలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బ్లిట్జ్ ప్లే ఆఫ్ రౌండ్‌లో వరుసగా మూడుసార్లు మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించాడు. వీరిద్దరి మధ్య మొత్తం 6 గేమ్స్ జరిగాయి. ఇందులో ప్రజ్ఞానంద మూడుసార్లు విజయం సాధించగా.. కార్లసన్ ఒకసారి గెలిచాడు. వీటిలో తొలి రెండు గేమ్స్ మాత్రం డ్రాగానే ముగిశాయి. అయితే మొత్తం మీద కార్ల్‌సన్ 16 పాయింట్లు సాధించి విజేతగా నిలిచారు. ప్రజ్ఞానంద మాత్రం 15 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచారు.

ఈ టోర్నమెంట్ ప్రారంభంలోనే ప్రజ్ఞానంద నాలుగు విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ఆరో ర్యాంక్ క్రీడాకారుడైన లెవాన్ అర్నోయాన్‌ను 3-1 తేడాతో ఓడించాడు. అదే విధంగా ఒక దశలో అయితే అందరినీ ఆశ్చర్య పరుస్తూ..కార్ల్‌సన్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగాడు. చైనా ఆటగాడు క్యూయాంగ్ లెయిమ్ లీ చేతిలో ఓడిపోవడంతో ఆటలో కొంచెం వెనుకబడ్డాడు. అనంతరం పోలాండ్ ఆటగాడు జాన్ కె.డూడా చేతిలో కూడా ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో కార్ల్‌సన్ నాలుగు గేమ్స్ ఆడిన ప్రజ్ఞానంద మొదటి రెండు రౌండ్లను డ్రా చేసుకున్నాడు. మూడో గేమ్‌లో ఓడిపోయినప్పటికీ..కీలకమైన నాలుగో గేమ్‌లో పుంజుకుని విజయం సాధించాడు. దీంతో ప్రజ్ఞానంద ,కార్ల్‌సన్‌కు ట్రై బ్రేక్ పడింది. మ్యాచ్‌ను ఇంత ఉత్కంఠ భరితంగా నడిపి ప్రజ్ఞానంద కార్లసన్‌కు గట్టి షాకిచ్చాడు.


 
							 
							