ఒకరోజు కలెక్టర్లుగా హైస్కూలు అమ్మాయిలు..ఈ ‘శక్తి మిషన్’
‘శక్తి మిషన్’ పేరుతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దసరా నవరాత్రుల సందర్భంగా పది జిల్లాలకు హైస్కూల్ అమ్మాయిలను కొత్త కలెక్టర్లుగా ఒక రోజు నియమించింది. వారందరూ జిల్లాకు సంబంధించిన పరిపాలనా బాధ్యతలు ఒకరోజు నిర్వహించారు. ఉత్తుత్తినే కాదు, నిజంగానే వారి మాటలను అధికారులు తుచ తప్పకుండా పాటించారు. స్త్రీ శక్తి నిరూపణ కోసం యూపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఈ కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భాగంగా జనతా దర్శన్ అనే పేరుతో ప్రజా దర్బారులో కూడా పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఈ అమ్మాయిలు. ఆడపిల్లల పట్ల వివక్షను పారద్రోలడం, అమ్మాయిలలో చదువుకుంటే సర్వోన్నత పదవులలో ప్రజలకు ఎలా సేవ చేయవచ్చనే విషయాన్ని తెలియజెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం. ఈ కార్యక్రమంలో పది జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన పదిమంది అమ్మాయిలు ఎంతో తెలివిగా సమస్యలను పరిష్కరించారు. అంతేకాదు, ప్రజల సమస్యలను విని తాము బాగా చదువుకుని నిజంగానే ఆ స్థాయికి చేరుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని కనబరిచారు. ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో జరగాలని, అమ్మాయిలందరూ వివక్షత నుండి దూరమవ్వాలని ఆశించారు.


 
							 
							