పేదరిక నిర్మూలనే లక్ష్యం..ఇదే నా పాలిటిక్స్ :సీఎం జగన్
• మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా అమలు చేస్తున్నాం
• 45 నెలల పాలనలో సమూల మార్పు
• జనవరి నుంచి 3 వేల రూపాయలు పెన్షన్ అమలు
•కొత్త వైద్య కళాశాలలను నిర్మిస్తున్నామని వెల్లడి
ఏపీలో బడ్జెట్ సమావేశాలలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. నా నడక నేలపైనే నా ప్రయాణం పేద వర్గాల తోనే నా యుద్ధం పెత్తందారుల పైనే అంటూ తేల్చిచెప్పారు. నా లక్ష్యం పేదరిక నిర్మూలన… అదే నమ్మి ఆచరిస్తున్నానన్నారు. ఇదే నా ఎకనామిక్స్ ఇదే నా పాలిటిక్స్ ఇది మా నాన్నను చూసి నేర్చుకున్న హిస్టరీ ఇవన్నీ కలిపితేనే జగన్ అని అసెంబ్లీలో జగన్ అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాదాలు తీర్మానం చర్చ జగన్ మాట్లాడారు ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్ బైబిల్‌గా భావించి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలుపరచడంలో చిత్తశుద్ధి నిజాయితీ నిబద్ధత ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం 45 నెలల పాలనలో రాష్ట్రంలో సమూల మార్పు వచ్చిందని జగన్ అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయతను పెంచి మార్పును తీసుకొచ్చామన్నారు. కుల, మతాల రాజకీయాలకు తావు ఇవ్వకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు. అందరూ నా వాళ్లే అనే విధంగా పాలనను అందించామన్నారు. రాష్ట్రంలో జగన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు.
గతంలో బడ్జెట్ అంటే ఎవరికీ అర్థం కాని విధంగా ఉండేదని ఇప్పుడు ప్రతి మనిషికీ, ప్రతి గడపకూ వివరాలను అందించగలుగుతున్నామని జగన్ అన్నారు. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 600 పౌరసేవలను అందించగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధిక వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం ఏపీ అని చెప్పారు. సుపరిపాలన కారణంగానే దీన్ని సాధించగలిగామని అన్నారు. రూ. 1.97 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బటన్ నొక్కి వేశామని చెప్పారు. రాష్ట్రంలో గతంలో ఉన్న 13 జిల్లాలను 26 పెంచడం ద్వారా ప్రజలకు మరింత వేగంగా రెట్టింపు సేవలు అందిస్తున్నామని జగన్ తెలిపారు.

