తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల వాయిదా
తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్ -2 పరీక్షల మధ్య వారం రోజుల వ్యవధి మాత్రమే ఉందని, గ్రూప్ 2 ని వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎంపీ మల్లు రవి తెలిపారు. గ్రూప్2, గ్రూప్ 3 పరీక్షల వాయిదాకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించింది. పరీక్షల నిర్వహణపై త్వరలో తేదీలు ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. అంతేకాక గ్రూప్ 2 పోస్టుల పెంపుపై కూడా ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొన్నారు. గ్రూప్ 2 అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో అభ్యర్థులతో చర్చించారు. ఈ చర్చల అనంతరం టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి, డిసెంబరులో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. త్వరలోనే ఓవర్ ల్యాపింగ్ లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. ఈ చర్చలలో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కొందరు గ్రూప్ 2 అభ్యర్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టులకు గాను, 5.51 లక్షల మంది అభ్యర్థులు దరకాస్తులు చేసుకున్నట్లు సమాచారం. అందుకే కొన్ని పోస్టులు పెంచే విషయం కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.