ప్రముఖ తెలుగు హీరో కన్నుమూత
ఆనాటి ప్రముఖ తెలుగు హీరో, క్యారెక్టర్ నటుడు శరత్ బాబు హైదరాబాదులో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. గత కొంతకాలంగా చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత నెలలో మృత్యువు చివరి క్షణం వరకూ వెళ్లి, వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో చాలాకాలం బాధపడ్డారు. అవయవాలు పనితీరు ఒక్కొక్కటిగా నిలిచిపోయి నరకం అనుభవించారు.

ఆయన ఆముదాల వలసలో 1951లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 72 సంవత్సరాలు. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలో కూడా 250 సినిమాలలో నటించారు. కథానాయకుడిగా 70 చిత్రాలలో నటించారు. ఆయన ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలలో హీరోగా నటించారు. సహాయనటుడిగా నటించిన ఎన్నో చిత్రాలకు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అభినందన,ముత్తు, కొండపల్లిరాజా, సాగరసంగమం, సంసారం ఒక చదరంగం, సితార, వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో ముఖ్యపాత్ర పోషించారు. మూడు సార్లు నంది అవార్డు అందుకుని హ్యాట్రిక్ సాధించారు. తెలుగు సీనియర్ నటి రమాప్రభకు ఆయన మాజీభర్త. ఆయన మృతిపై పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన భౌతిక కాయాన్ని చెన్నై తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

