కాంగ్రెస్‌లోకి పూనమ్ కౌర్..?
సినీ నటి పూనమ్ కౌర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రత్యక్షమయ్యారు. రాహుల్‌తో కలిసి కొంత దూరం నడిచిన పూనమ్.. ఆయనతో 15 నిమిషాల పాటు భేటీ కూడా అయ్యారు. చేనేత సమస్యలపై పార్లమెంటులో రాహుల్‌ను పూనమ్ కోరారు. సమస్యలపై రాహుల్ స్పందిస్తున్న తీరును కొనియాడారు. ఖాదీ వస్త్రాలకు, కాంగ్రెస్ పార్టీకి అవినాభవ సంబంధం ఉందన్నారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో త్వరలో భేటీ కావాలని పూనమ్‌ను రాహుల్ సూచించారు. వారితో సమావేశం ఏర్పాటు చేసే బాధ్యతను కాంగ్రెస్ నేతలకు అప్పగించారు. దీంతో ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయాల్లోకి రాను: పూనమ్
రాహుల్ గాంధీ ప్రజా సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని.. వినతి పత్రం ఇస్తే చదివిన తర్వాతే మాట్లాడుతున్నారని పూనమ్ కౌర్ కొనియాడారు. చేనేత వస్త్రాలపై రాష్ట్ర జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేశారు. చేనేతల కోసం పనిచేయని వారికి మునుగోడు ఉప ఎన్నికలో ఓటేయొద్దని సూచించారు. అయితే.. తాను సమస్యలపై పోరాటం చేస్తున్నానని.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని పూనమ్ స్పష్టం చేశారు. రాహుల్ మాత్రం పూనమ్‌ను సోనియా, ప్రియాంకలతో కలవాలని చెప్పడాన్ని బట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

