భారీ పోలింగ్ దిశగా మునుగోడు
మునుగోడు ఉప ఎన్నికలో పోలింగ్ భారీ ఓటింగ్ దిశగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 41.3 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఎక్కువగా మహిళలు, వృద్ధులు ఓటు వేశారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు సైతం మునుగోడుకు వచ్చారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తమ ప్రాంతాల్లో ఓటు వేశారు. మునుగోడులో ఎప్పుడూ ఓటింగ్ శాతం భారీగానే నమోదవుతుంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ 91 శాతానికి పైగా పోలింగ్ నమోదవడం విశేషం.

సర్వేల్‌లో మహిళా పోలింగ్ కేంద్రం..
చౌటుప్పల్, జనగామ, చండూరు, తమ్మలపల్లి తదితర ప్రాంతాల్లో బీజేపీ మద్యం, నగదు పంపిణీ చేస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు మంత్రి జగదీశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈవీఎంలు మొరాయించడంతో మూడు చోట్ల మార్చిన తర్వాత పోలింగ్ కొనసాగిస్తున్నట్లు వికాస్‌రాజ్ చెప్పారు. 42 మంది స్థానికేతరులను గుర్తించి.. బయటకు పంపించేశామన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ఓటుకు డబ్బుల ప్రస్తావన రావడం దురదృష్టకరమని చెప్పారు. సర్వేల్‌లో మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని.. అందులోని పోలింగ్ సిబ్బంది అంతా మహిళలే అన్నారు.