అధికారంలోకి వస్తే అగ్నిపథ్ రద్దు
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక కూటమికి రంగం సిద్ధం చేస్తూ, ‘బీఆర్‌ఎస్ నేతృత్వంలో ప్రభుత్వం’ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) చీఫ్ కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణలోని ఖమ్మంలో జరిగిన పార్టీ తొలి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సాయుధ దళాల్లో అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామన్నారు. దళితబంధు అమలు చేయాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుని జాతీయస్థాయికి వెళ్లాలని నిర్ణయించిన తర్వాత భారీ సంఖ్యలో హాజరైన ఈ సభకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీపీఐకి చెందిన డి రాజా కూడా పాల్గొన్నారు. కేంద్రం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని “విఫలం” పథకం అన్నారు కేసీఆర్. ‘రైతు బంధు’ వంటి సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యలకు రెండు పార్టీలే కారణమని ఆరోపిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.

కేరళ సీఎం విజయన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై కేంద్రంలోని వారి దాడి జరుగుతున్న తరుణంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భావసారూప్యత కలిగిన సీఎంలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రజా ఉద్యమం చేపట్టేందుకు కేసీఆర్ చొరవ చూపారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనుకూల విధానాలకు సీఎం విజయన్ మద్దతు తెలిపారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారని, మాతృభాషలను పక్కన పెట్టి హిందీని జాతీయ భాషగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విజయన్ విమర్శించారు. మాతృభాషలను తుంగలో తొక్కి హిందీని రుద్దడం వల్ల దేశ సమైక్యత దెబ్బతింటుందన్నారు. శాసనసభకు సంబంధించి న్యాయవ్యవస్థ అధికారాల అంశంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ చేసిన వ్యాఖ్యలపై ఇటీవలి వివాదాన్ని ఎత్తిచూపిన విజయన్, న్యాయవ్యవస్థపై కూడా దాడి జరుగుతోందని అన్నారు.

2024 ఎన్నికలకు ఇంకా 400 రోజుల సమయం మాత్రమే ఉందని ప్రధాని మోదీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యానించడంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, అధికార బీజేపీ రోజుల లెక్కింపు ప్రారంభించిందని, ఒక్కరోజు కూడా నిలబడదని అన్నారు. “399 రోజుల తర్వాత బిజెపి అధికారం నుండి తప్పుకుంటుంది మరియు 400 వ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది” అని అన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని వెనక్కు నెడుతోందని… ప్రగతిశీల నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చి దేశాభివృద్ధికి పాటుపడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చారిత్రాత్మకమైన ఖమ్మంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇంత పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించి యావత్ దేశానికి సందేశం ఇచ్చారని అఖిలేశ్ కొనియాడారు. అధికారంలో ఉన్న బీజేపీని తిరస్కరిస్తూ ఉత్తరప్రదేశ్ చివరికి ఇతర రాష్ట్రాలతో కలిసిపోతుందని పేర్కొన్నారు.

కేసీఆర్ తనకు పెద్దన్నలాంటి వాడంటూ సంబోధించారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తెలంగాణలో అమలు చేస్తున్న కంటి వెలుగు అద్భుత పథకమని కితాబిచ్చారు. కేసీఆర్ ఢిల్లీ గల్లీల్లో తిరిగి ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌లను తెలంగాణలో బస్తీ దవాఖానాగా మార్చారన్నారు. తమిళనాడు సీఎం ఢిల్లీ స్కూళ్లను దర్శించి తమిళనాడులో స్కూళ్లను మార్చుకున్నారన్నారు. తాము ఒకర్ని చూసి ఒకరం ప్రజలకు సేవ చేస్తుంటే.. బీజేపీ మాత్రం గవర్నర్ల ద్వారా ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టడంలో ప్రధాని బీజీగా ఉన్నారన్న కేజ్రీవాల్, 2024 లోక్ సభ ఎన్నికలు దేశంలో మార్పు కోసం వినియోగించాలన్నారు.

ఇక పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ర్యాలీలో ప్రసంగిస్తూ భారతీయ జనతా పార్టీని “భారతీయ జుమ్లా పార్టీ” అని అభివర్ణించారు. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. “(డొనాల్డ్) ట్రంప్ భార్య (మెలానియా ట్రంప్) ప్రభుత్వ పాఠశాలను చూడాలనుకున్నప్పుడు, వారు (బీజేపీ) ‘కేజ్రీవాల్ వాలా’ పాఠశాలను చూపించారు. భారతీయ జుమ్లా పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ప్రతి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని… గెలవని చోట ఉపఎన్నికలు నిర్వహిస్తారని లేదా ఎమ్మెల్యేలను కొంటారని విమర్శించారు.

ఖమ్మం రాకముందు కేసీఆర్, ప్రతిపక్ష నేతలు రెండు హెలికాప్టర్లలో యాదగిరిగుట్టను సందర్శించి ఆలయంలో పూజలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కె. కవిత కూడా హాజరయ్యారు. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) గత ఏడాది అక్టోబర్ 5న తన పేరును ‘బీఆర్‌ఎస్’గా మార్చుకుంది, పార్టీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.