పదునెక్కుతున్న పొలిటికల్ వ్యూహాలు..
ఇక తాడో పేడో.. చావో రేవో. తేల్చు కోవాల్సిందే. తేలాల్సిందే. మూడేళ్ళు మూడు యుగాలుగా గడిచి పోయాయి. ఇంకా రెండేళ్ళు భరించాలి. చీత్కారాలు.. చీదరింపులు.. అవమానాలు.. ఆరోపణలు.. అబ్బో.. ఇలా ఎన్నో. ఎక్కడ ఏ తప్పు జరిగినా మళ్ళీ ఐదేళ్ళు ఇలాంటివన్నీ తప్పవు. ఇదే ఇప్పుడు టీడీపీని భయ పెడుతోంది. అందుకే అన్నీ ఆలోచించి టీడీపీ అడుగులు వేస్తోంది. పొత్తులు కుదిరితే ఒకింత ధైర్యాన్ని కూడగట్టుకోవచ్చు. ఇంకా ఏ విషయం తేలలేదు. ఎవరూ బయటపడ్డం లేదు. కానీ.. పార్టీని గట్టెక్కించి, అధికార పీఠానికి దగ్గర చేయాలంటే.. ఇంకా జోరు పెంచాలి. కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపాలి. రానున్నది మన సర్కారే అన్న ధీమానివ్వాలి. ఇదే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే టీడీపీని పూర్తిగా ఇరుకున పెట్టేందుకు వైసీపీ ఓ మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. మానసికంగా కుంగదీసి చంద్రబాబు, లోకేష్ ను కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకే పరిమితం చేసే తంత్రాన్ని రచించిందన్న ప్రచారం జరుగుతోంది.

చాపకింద నీరులా జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న భావన. ఆ పార్టీలో ఇప్పటికే అంతర్గత కుమ్మలాటలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. అన్ని జిల్లాల్లో వర్గ పోరు తారాస్ధాయిలో ఉంది. ఇదే సరైన సమయం. పావులు కదిపితే. పాచికలు పారితే. అంతా అనుకూలిస్తే. కాలం కలిసి వచ్చినట్టే. ఇందుకు ఏదో ఒకటి చేయాలి.. చేసి విజయం సాధించాలి. మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టి ప్రజలకు దగ్గరవ్వాలి. ఇందుకు అనుసరించాల్సిన అన్ని మార్గాలను ఇప్పుడు చంద్రబాబు అన్వేషిస్తున్నారు. టీడీపీకి పూర్వం వైభవం తీసుకు వచ్చి మళ్ళీ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు పావులు కదుపుతున్నారు. జాతీయ పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ ఎన్.డీ.ఏకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మోదీతో సన్నిహిత సంబంధాల కోసం తపిస్తున్నారు. కాలం కలిసి రావాలంటే కలవాలి .. కలిసి నడవాలి. అధికారం దక్కాలంటే.. అందలం ఎక్కాలంటే ఎన్.డీ.ఏ పంచన చేరాలి. ఇదే ఇప్పుడు చంద్రబాబు వ్యూహంలా కనిపిస్తోంది. ఈ దిశగానే ఆయన తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. అయితే అనుకున్నది అంతా ఈజీగా నెరవేరుతుందా ? ఎన్.డీ.ఏలో మళ్ళీ బాబు చక్రం తిప్పుతాడా..?ఇవి కార్యకర్తల మదిలో మెదులుతున్న ప్రశ్నలు.

గత ఎన్నికలు టీడీపీకి ఇంకా మింగుడుపడ్డం లేదు. ఆ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఘోర పరాభవం మిగిల్చిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. తెప్పరిల్లి లేచి నిలబడేందుకు ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 175 స్ధానాల్లో వైసీపీ 151 స్ధానాలను కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ విజయంతో జాతీయ పార్టీల దృష్టిని వైసీపీ తనవైపు తిప్పుకుంటే.. టీడీపీ మాత్రం అవమాన భారంతో తీవ్రంగా కుంగి పోయింది. జాతీయ నేతలు కానీ, పార్టీలు కానీ చంద్రబాబును పట్టించుకోవడం పూర్తిగా మానేశాయి. ఆ పార్టీవైపు కూడా చూడడం కూడా లేదు. అయితే తిరిగి లేచి నిలబడాలంటే .. వ్యూహాలకు పదును పెట్టాలి. ఆ క్రమంలోనే జిల్లా పర్యటన మొదలు పెట్టారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదరణ బాగుంది. స్పందన విశేషంగా ఉంది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే ఇటీవల కుప్పంలో ఓ భయాన్ని కల్పించే ప్రయత్నం జరిగింది. దీంతో అక్కడ గెలుపుపై టీడీపీకే నమ్మకం పోయే విధంగా వైసీపీ ఓ వ్యూహాన్ని రచించిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అక్కడ గెలుపుపై దృష్టి పెడితే రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉండదన్నది వైసీపీ భావన. దీనివల్ల తమకు లాభం ఉంటుందని జగన్ అనుకొని ఉండొచ్చు.. కానీ టీడీపీ అందుకు తగ్గ రీతిలోనే ఎత్తులు వేస్తోంది.

ఇక లోకేష్ పై కూడా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని టీడీపీ వర్గాలు అనుకుంటున్నాయి. మంగళగిరిలో టీడీపీని బలహీనపరిచే ఆలోచనలకు తెరతీసింది అధికార పార్టీ. అక్కడ ప్రధాన సామాజిక వర్గ నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తూ.. లోకేష్ కు చెక్ పెట్టే పనిలో బిజీ అయ్యారు వైసీపీ నేతలు. ఈసారి ఎన్నికలు లోకేష్ కు అత్యంత ప్రతిష్టాత్మకం. గెలిస్తేనే మనుగడ. లేకపోతే రాజకీయంగా ఉనికిని పూర్తిగా కోల్పోయినట్టే. రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారినట్టే. గతంలో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి లోకేష్ ఓడిపోయారు. రాజధాని రైతులకు పూర్తి అండగా ఉన్నారు. ఒకింత సానుభూతి కూడా ఉంది. వాటన్నింటినీ క్యాష్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. అక్కడ నుండే తిరిగి పోటీ చేసి గెలవాలన్న ధృడ నిశ్చయంతో లోకేష్ ప్రణాళికలు తయారు చేసుకున్నారు. అయితే జగన్ ఎత్తుగడలతో అంతా తారుమారు అవుతుందని వైసీపీ వర్గాలు అనుకుంటున్నాయి. ఒక్క మంగళగిరి మీదే లోకేష్ మీదే పూర్తిగా దృష్టి పెట్టాల్సిన పరిస్ధితులు ఏర్పడుతున్నాయని .. ఇక అతను రాష్ట్రం మొత్తం తిరిగే ఆలోచన చేయరన్నది జగన్ దూరాలోచన. ఈ పరిణామాలు కలిసొస్తాయనే వైసీపీ ఓ పన్నాగం పన్నిందంటున్నారు.

ఇక సామాజిక మాధ్యమాలలో కూడా ప్రత్యర్ధిపై విరుచుకు పడేందుకు వైసీపీ ఓ వ్యూహాన్ని పన్నింది. ఇందుకు పెద్ద ఎత్తున సమన్వయకర్తలను కూడా నియమించింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 132 మంది సమన్వయ కర్తలు సోషల్ మీడియాలో పార్టీ నిర్దేశించిన అంశాలను ఉరుకులు పెట్టించనున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకలాపాలతో పాటు ప్రధానంగా టీడీపీ ప్రచారాలను ఎలా తిప్పి కొట్టాలి అన్న అంశాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆదేశించారు. టీడీపీ అధికారంలోకి వస్తుందన్న భయమే జగన్ చేత ఇలాంటి పనులన్నీ చేయిస్తోందని టీడీపీ వర్గాలు అనుకుంటున్నాయి. దీనికి తోడు టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ అమలు చేస్తున్న పథకాలన్నింటినీ తీసేస్తారన్న ప్రచారాన్ని సాగించేందుకు కూడా సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించుకోబోతున్నారని భావిస్తున్నారు. దీని వల్ల టీడీపీపై పైచేయి సాధించవచ్చన్న భ్రమలో వైసీపీ ఉందని చంద్రబాబు అంటున్నారు. అలాగే మోదీకి దగ్గరయ్యేందుకు ఓవైపు బాబు చేస్తున్న ప్రయత్నాలను గండి కొట్టాలని కూడా వైసీపీ వ్యూహ రచన చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడే లోపు అన్ని రకాలుగా బీజేపీకి దగ్గర అవ్వాలని చంద్రబాబు తహతహ లాడుతున్నారు. ఒకవేళ బీజేపీతో బాబు కలిస్తే .. ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న అంశాలను వైసీపీ అంచనా కడుతోంది. కలిసొచ్చిన సందర్భాన్ని చంద్రబాబు చక్కగా వినియోగించుకున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికలా ఇప్పుడు లేవు. కానీ తీవ్రత పెరుగుతోంది. పొత్తుల విషయమా ఇంకా తేలలేదు.. కానీ.. ఆందోళన పెంచుతోంది.


