Andhra PradeshNews

ఏపీలో ఆసక్తిగా మారుతున్న పొలిటికల్ సీన్ – కోవర్టులకు చెక్ పెట్టే పనిలో జనసేన

వ్యూహం బలంగా ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధిచవచ్చు. పావులు కరెక్ట్ గా పడితే ఎంతటి వారినైనా మెడలు వంచచ్చు. ఉక్కు పిడికెళ్ళెత్తి ఒక్కటిగ గర్జిస్తే .. ఎంతటి బలవంతుడినైనా పదవి నుండి లాగి పారేయొచ్చు. ఇదే వ్యూహం.. ఇదే ఎత్తుగడ ఇప్పుడు జనసేనకు వేదమంత్రంలా మారింది. వైసీపీ కబంద హస్తాల్లోంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలన్నదే తమ నాదమంటూ సమర సైరన్ ను మోగించింది. ఆ దిశగా పావులు కదుపుతూ అడుగులు వేయబోతోంది. అయితే ఎన్నికలకు ఎలా వెళ్ళాలి ? ఎలా అధికార పక్షాన్ని ఎదుర్కొనాలి ? అన్న అంశాలపై తమ ప్లాన్లు తమకున్నాయంటోంది జనసేన. ఒక్కొక్క అస్త్రానికి పదును పెడుతోంది. అంశాలను పరిశీలిస్తోంది. వాస్తవాలను ప్రజల ముందుంచే విధానాలకు మెరుగులు పెడుతోంది. తమతో కలిసి నడిచే పార్టీలను సంప్రదించి .. ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నాల పైనా దృష్టి పెట్టింది.


ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయినా ఇప్పటి నుండే అన్ని పార్టీలు ఆ దశగానే ఆలోచనలు మొదలు పెట్టాయి. అధికార పార్టీ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలను నిర్వహిస్తూ పార్టీ విజయావకాశాలను అంచనా వేస్తోంది. ఎవరికి టికెట్లు ఇస్తే లాభం.. ఎవరికి ఇస్తే నష్టం అన్న అంశాలను కూడా పరిశీలిస్తోంది. సొంత సర్వేలతో పాటు పలు ఏజెన్సీల ద్వారా తెప్పించుకున్న నివేదికల ఆధారంగా పూర్తి స్ధాయిలో అధ్యయనం మొదలు పెట్టింది వైసీపీ. ఇక అసంతృప్తి బెడదపై కూడా దృష్టి పెట్టి .. టికెట్లు లభించని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి అన్నది కూడా ముందే ఆలోచించి పెట్టుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే ఓ వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తోంది. పాత వ్యూహాలకు పదును పెట్టి కొత్తగా తెరపైకి తెస్తోంది. ఈసారి తటస్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పార్టీ భావిస్తోంది. గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో ఈ ప్రయోగం ఫలించి టీడీపీ ఘన విజయం సాధించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటోంది. ఇక ఉనికిలోనే లేని కాంగ్రెస్ కూడా ఏం చేయాలా అని ఆలోచన జరుపుతోంది. దీనికి తోడు పొత్తుల అంశం కూడా తెరపైకి వస్తోంది.


ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ మూడు పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన. ఇవే రేపటి ఎన్నికల్లో ప్రభావం చూపించబోతున్నాయి. దీంతో రానున్న ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే అలాంటి వాతావరణం క్రియేట్ అవుతోంది. అగ్గి రేపే కామెంట్లు. చిచ్చుపెట్టే ఆరోపణలు.. చీల్చి చెండాడే విమర్శల జోరు పెరిగాయి. ఈ క్రమంలో జనసేన కూడా అత్యంత పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయబోతోంది. అయితే అంతకు ముందే పార్టీలో క్రమశిక్షణా సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. పోరాటానికి సిద్ధం కావాలంటే ముందుగా సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి. తమ పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు మళ్ళీ దొర్లకుండా జాగ్రత్తలు పడాలి. ఇలా ఎన్నో అంశాలపై దృష్టి పెట్టారు జనసేనాని పవన్ కల్యాణ్. ఇక ఎవరు మన వారు.. ఎవరు కోర్టులు అనే అంశంపై కూడా జనసేన తీవ్రంగా పరిశీలిస్తోంది. పార్టీలో ఉంటూ మన వారిగానే నటిస్తూ .. ఇతరుల కోసం పని చేసే వారిని ఏరి పారేసేందుకు చూస్తోంది. ఇక్కడ ఉంటూ .. అక్కడ బెర్తులు ఖాయం చేసుకుంటున్న వారూ ఉన్నారు. వారిని గుర్తించే పనిలో పడ్డారు. అలాంటి కలుపు మొక్కలను తొలగిస్తే కానీ పార్టీ .. అన్ని రకాలుగా ముందుకు వెళ్ళగలదని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా చెప్పారు.


తిన్నంటి వాసాలు లెక్కలు పెట్టే వారు అన్ని పార్టీలలోనూ ఉన్నారు. ఉన్న పార్టీలకే నిప్పు పెట్టి .. పక్క చూపులు చూసే వారూ ఎందరో. ఇక్కడ పని చేస్తూ .. అక్కడ మెప్పు పొందుతున్న వారూ లేకపోలేదు. ఉన్న పార్టీలో గుర్తింపు లేక పోయినా.. గోడ దూకగానే పదవులు పొందుతున్న వారు ఉన్నారు. వారిదంతా ఒకే స్కూల్. వారి ఆలోచనంతా ఒకటే. ఉన్న ఇంటిని ధ్వంసం చేయడం. నా అనుకున్న వారికి ఎర్త్ పెట్టడం. ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు జనసేనలో కూడా జరుగుతోంది. అలాంటి కంత్రీ నేతలను గుర్తించి బయటకు పంపే పనికి శ్రీకారం చుట్టారు పవన్ కల్యాణ్. ఇలాంటి వ్యవహారాలను చక్కదిద్దుకుని ఎన్నికలకు సిద్ధమవ్వాలని జనసేన భావిస్తోంది. ఇక పొత్తులపై కూడా దృష్టి పెట్టింది. ఓ అరాచక, విధ్వంస పాలకు చరమగీతం పాడాలంటే . సమైక్య పోరు ఒ్కటే మార్గమని జనసేన భావిస్తోంది. ఈ క్రమంలో అవసరమైతే శత్రువు అనుకున్న వారితో కూడా కలిసి పని చేసేందుకు సిద్ధమేనని జనసేన భావిస్తోంది. అయితే జనసేనతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ ఆసక్తి చూపిస్తోంది. జనసేన, బీజేపీల ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటే తమ లక్ష్యమని బీజేపీ నాయకులు ప్రకటించారు. టీడీపీ కూడా ఈ రెండు పార్టీలతో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తోంది. మరి.. ఎన్నికల సమయానికి ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో.. ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తారో.. ఎవరిని ఓటర్లు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.