Andhra PradeshNews

సెటైర్లు వేస్తే సీటొస్తుందా..? చిక్కటి తిట్లతో పదవొస్తుందా..?

నాయకత్వ పటిమ ఉంటే చాలదు. నవ్వించే ప్రతిభ కూడా ఉండాలి. చతురతను పండించి ప్రజలను ఆకర్షించే తత్వం ఉండాలి. చక్కటి తెలుగులో మాట్లాడడం కాదు. చిక్కటి తిట్లతో ఎదుటి వారిని దూషించే డాషింగ్ ఉండాలి. ఒక్కసారిగా అందరి చూపును డైవర్ట్ చేయగలిగే డైనమిజం ఉండాలి. ఇవ్వన్ని ఉంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ. ఈ సుగుణాలపైనే ఇప్పుడు పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. ఎగతాళి, వెటకారం, వ్యంగ్యం, హాస్యంతో మిళితమైన సెటైర్లు వేయగలిగే ఓ ప్రత్యేక కళ ఉండాలి. ఇక చతుషష్టి కళలలో ప్రవేశం .. అదనపు అర్హతగా పరిగణిస్తారు. ఇలా ఎన్నున్నా.. విత్తం లేకపోతే చిత్తం చూపే ప్రశ్నే లేదు. సీటు దక్కే అవకాశమే లేదు. ఇప్పుడు పరిస్ధితుల్లో రాజకీయాలను, రాజకీయ నేతలను చూస్తుంటే ఈ అంశాలు ఉంటేనే .. రాణిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని కొన్ని పరిణామాలు కూడా ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.


భాషకు బాగా సాన పెడితే సెటైర్లు వాటంతట అవే వచ్చేస్తాయన్న సూత్రం తెలిసిన నేతలు ఇప్పుడు ఒకరికి ఒకరుగా పెరిగి పోతున్నారు. పనికి రాని పదాలను అలవోకగా ఒలికించగలిగే.. పలికించగలిగే నోళ్ళకే ప్రాధాన్యత పెరుగుతోంది. సాంప్రదాయాలా? చట్టుబండలా? అని కొట్టి పారేస్తూ కొత్త ఒరవడిని ప్రవేశ పెడుతున్నారు. సెటైర్లతో ప్రత్యర్ధులను కుమ్మేస్తున్నారు. ఈ పద్ధతిని అన్ని పార్టీలు ఒంట బట్టించుకుంటున్నాయి. ఇక విషయంలోకి వెళితే.. జనసేన నేత వెంకట మహేశ్ .. వైసీపీ నేతలను తన సెటైర్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ .. జనాలకు కితకితలు పెట్టాడు. వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ బెజవాడ బ్రహ్మానందం.. మంత్రి జోగి రమేష్ ఓ జోకర్.. అంటూ సెటారికల్ విమర్శలు చేశాడు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో ఉండి చిరంజీవికి తప్పుడు సలహాలు ఇచ్చిన ప్రబుద్ధుల్లో వెల్లంపల్లి కూడా ఒకరంటూ మండిపడ్డారు. ఇక వరుస పెట్టి గుడివాడ గుర్నానాధ్, కొడాలి నానిపై కూడా ఎగిరిపడ్డారు. మతిభ్రమించి తమనేత పవన్ కల్యాణ్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మహేష్ దులిపేశారు. నోరు జారితే నాలుకలు కత్తిరించడం ఖాయం అంటూ ఓ హెచ్చరిక కూడా చేశారు. ఇదో రకం.


రానున్న మూడు దశాబ్దాల పాటు దేశంలో బీజేపీదే హవా అంటూ జవహర్లాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆనంద్ రంగనాధ్ జోస్యం చెప్పారు. 2026 వరకు నరేంద్ర మోడీ పదవిలో ఉంటే ఆ తర్వాత అమిత్ షా, యోగి ఆదిత్య నాధ్, హేమంత్ బిశ్వశర్మ, తదితరులు వరుసగా ప్రధానులు అయ్యే ఛాన్స్ ఉందన్నారు. అయితే ఈ మూడు దశాబ్దాలూ రాహుల్ గాంధీయే విపక్ష నేత అంటూ సెటైర్ వేశాడు. కేవలం తిట్టడానికే కాదు.. పొగడాలన్నా పదాల విరుపులు ఉండాల్సిందే. పద గాంభీర్యాన్ని ప్రదర్శించాల్సిందే. అందులో మేటి ఉండవల్లి అరుణ్ కుమార్. నిన్నటి దాకా జగన్ ను విమర్శించిన ఆయన ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అంటూ పైకెత్తేశాడు. ఆ ఫేస్ కట్ అలాంటిది అంటూ తెనె జల్లులు కురించాడు. ఇక పనిలో పనిగా నారా లోకేష్ వేస్టే అంటూ ఓ సెటైర్ కూడా వేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ స్ఫురద్రూపి. సీనియర్ ఎన్టీఆర్ కు ఆయనే సాటి. ఇలాంటి పొగడ్తలు, తెగడ్తలు చేసే మాటకారి తనానికి లౌక్యాన్ని జోడించి ఉండవల్లి ఓ నేతగా ఎదిగారు. వైఎస్ కు దగ్గరై .. ఎన్నో పదవులు పొందారు. అదో కళ.


ఇక ఎవరైతే నాకేంటి .. డోంట్ ఖేర్ అంటూ ఓరేయ్.. తురేయ్ అనే భాషతో విపక్షాలకు చెమటలు పట్టించే వాళ్ళలో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వారు వైసీపీకి దొరికిన ఆణిముత్యాలు. ఇక తెలుగుదేశంలో కూడా అలాంటి భాషా ప్రావీణ్యం పెరిగి పోయింది. కావలి గ్రీష్మ, ఆనం వెంకట రమణా రెడ్డి , బోండా ఉమ, పిల్లి మాణిక్యరావు ఇలా కొత్త కొత్త వాళ్ళు చాలా మంది తమ వాక్చాతుర్యంతో తెర మీదకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆనం వివేకానందరెడ్డి గతంలో చాలా సెటైర్లు పండించి .. నవ్వించి తన కంటూ ఓ స్ధానాన్ని కల్పించుకున్నారు. ఇందంతా ఓ స్కూల్.


అన్ని పార్టీలు ఇలాంటి వాక్చతురిమలతో మెరిపించే వాళ్ళను, మెప్పించే వాళ్ళను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. అధికార ప్రతినిధులుగా ప్రమోషన్లు ఇచ్చి .. మీడియా ముందు నిలబెడుతున్నాయి. మరి ఇలాంటి వాక్భూషణులు బీజేపీలో కనిపించడం లేదు. ఈ విషయంలో ఆ పార్టీ కొద్దిగా వెనకంజలోనే ఉందని చెప్పాలి. ఇంకా సాంప్రదాయపు మూసలోనే ఆ పార్టీ కొనసాగుతోందనే భావించాలి. పరుగులు తీస్తున్న కాలంతో పాటు అన్ని రంగాలలో మార్పులను చూస్తున్నాం. భాషను కూడా కొత్త పుంతలు తొక్కిస్తున్న నేతలనూ చూస్తున్నాం. ఇంకా ఇలాంటి వింత పోకడలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న బెంగ తెలుగు భాషాభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది.