Andhra PradeshHome Page Slider

ఏపీలో మారనున్న రాజకీయ సమీకరణాలు

  • భారతీయ జనతా పార్టీ తో కూటమి కట్టాలని భావిస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు
  • కర్ణాటక ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు
  • వైయస్సార్సీపి విముక్త రాష్ట్రం కావాలని ఇరు పార్టీలు ఎత్తులు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కలిసి పోటీ చేస్తారనే అనే వార్తలకు గట్టి బలాన్ని చేకూర్చాయి. వారిరువురు భేటీలో పొత్తులు పైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రం కావాలని అందుకు వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని ప్రకటించారు. ఆదిశలోనే ఆయన చర్యలు ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటికే వివిధ సందర్భాల్లో మూడుసార్లు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ఇప్పటికే రాజకీయ వాతావరణం కనిపిస్తోంది.

ఈ పరిస్థితిని బలపరుస్తూ శనివారం లోకేశ్ పాదయాత్రలో జనసేన నేతలు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం, జనసేన కలిసినప్పటికీ వీరిద్దరికీ, కేంద్రంలో బలమైన శక్తిగా ఉన్న భారతీయ జనతా పార్టీ కలిస్తే రాష్ట్రంలో తిరుగులేని కూటమిగా తయారవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కలిసి రావాలని భారతీయ జనతా పార్టీని కూడా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని తమ కూటమిలోకి తీసుకురావాలని భావిస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీలు అందుకు కర్నాటక ఎన్నికల ఫలితాలను డెడ్ లైన్ గా పెట్టుకున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ శనివారం జరిగిన భేటీలో భారతీయ జనతా పార్టీతో పొత్తులు చర్చలు జరపాలని అందుకోసం కర్నాటక ఎన్నికల ఫలితాలు తర్వాత మరోసారి సమావేశం అవుదామని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత భారతీయ జనతా పార్టీతో కూడా చర్చలు జరపాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే వీరు ఎన్నికల ఫలితాలను ఎందుకు కీలకంగా భావిస్తున్నారనేది ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కర్నాటక ఎన్నికల సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి అంత బాగా ఏమీ లేదని చెబుతున్నాయి. కొన్ని సర్వేలు హంగ్ వస్తోందని చెబుతుండగా మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ వస్తుందని చెబుతున్నాయి. కాంగ్రెస్ కే పూర్తి మెజార్టీ వస్తే దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పట్టు దొరకని పరిస్థితి ఉంటుంది. అటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పై రోజు వార్తలు ఉంటున్న ఇప్పటికి ఉన్న పరిస్థితి అక్కడ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఉంది. కర్నాటక ఫలితాలు అటు ఇటు అయితే ఆంధ్రప్రదేశ్ నుండి తమకు మద్దతు ఇచ్చే ఎంపీలు ఉండటం భారతీయ జనతా పార్టీకి అవసరం. ఈ పరిస్థితి దృష్ట్యా కర్ణాటక ఫలితాలను బట్టి భారతీయ జనతా పార్టీతో చర్చలకు వెళితే తెలుగుదేశం జనసేనకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాగా అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం గానీ కేంద్ర నాయకత్వం గానీ చంద్రబాబుపైన అంత సానుకూలంగా లేరు. చంద్రబాబుతో సంబంధం లేకుండా ఇద్దరం కలిసి పోటీ చేద్దామని జనసేనకు భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తోంది. దీనివల్ల వైఎస్ఆర్సీపీకే లాభం జరుగుతోందని జనసేన భావిస్తుంది. ఈ తరుణంలో రిపబ్లిక్ కన్ టీవీ నిర్వహించిన సదస్సులో మాట్లాడిన చంద్రబాబు ప్రధాన మోడీ విధానాలను ఆకాశానికి ఎత్తేశారు. మోడీ విజన్ 2047కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు ఎన్డీఏ లో తిరిగి చేరతారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం ఇస్తోందన్న ఆయన ఆ విషయాన్ని తోసిపుచ్చలేదు.

మొత్తంగా చూస్తే రాష్ట్రంలో వైయస్సార్సీపీని ఎదుర్కోడానికి భారతీయ జనతా పార్టీ అవసరం కూడా ఉందని అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీలు భావిస్తున్నాయి. అది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కున్న ఓటింగ్ రీత్యా కాకుండా కేంద్రంలో బలమైన శక్తిగా ఉన్నందున తమ విజయానికి ఎటువంటి ఆటంకం ఏర్పరచకుండా ఉండేందుకు భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లాలని ఆలోచనలో తెలుగుదేశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తమ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉండేలా ఒప్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఈ మూడు పార్టీల కూటమి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. మరి కర్నాటక ఎన్నికల అనంతరం ఏపీ రాజకీయాల్లో కూడా మరిన్ని సమీకరణలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.