చంద్రబాబుకు ఐటి నోటీసులపై కొనసాగుతున్న రాజకీయ చర్చ
ఐటీ నోటీసులు సర్వసాధారణమే అంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు
బలమైన అస్త్రంగా మలుచుకుంటున్న వైఎస్ఆర్సీపీ
చంద్రబాబు రేపో మాపో అరెస్ట్ అనడంతో సొంత పార్టీలోనే కలవరం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయటంతో రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారి తీసింది. ఈ ఐటీ నోటీసుల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఐటి నోటీసుల అంశాన్ని అస్త్రంగా మలుచుకున్న అధికార వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీ డైలమాలో పడినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సంబంధించి, గత నెల నాలుగో తేదీన ఆదాయ పన్ను శాఖ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది.లెక్కల్లో చూపని118 కోట్ల వివరాలు తెలపాలని హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి ఆ శాఖ నోటీసులు పంపించింది. ఈ అంశం జాతీయ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో అప్పటికే రాజధాని నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైఎస్సార్సీపీ దీనిని బలమైన అస్త్రంగా మలుచుకొని చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పై విరుచుకుపడుతోంది. ఈ నోటీసులతో చంద్రబాబు అవినీతి చేశారని స్పష్టమైందని ఆరోపిస్తున్న వైఎస్సార్సీపీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

ఇదే సమయంలో ఏపీ సిఐడి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నిందితులకు సచివాలయ నిర్మాణ సంస్థ అయితే షాపుర్ జి పల్లంజీ ప్రతినిధులకు సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఉన్న యోగేష్ గుప్తా తో పాటు మనోజ్ వాసుదేవకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ నోటీసులు వ్యవహారం మరో రాజకీయ చర్చకు దారి తీయడంతో తెలుగుదేశం పార్టీ ఎదురు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది. ఐటీ నోటీసులు సాధారణమేనని ఇప్పటికే చంద్రబాబు ఇటీవల కాకినాడ జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వైఎస్ఆర్సీపీ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి ఐటీ శాఖ ద్వారా అక్రమ నోటీసులు ఇప్పించిందని ఎదురుదాడి మొదలుపెట్టారు. ఐటీ నోటీసులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంశాలు పక్కన పెట్టిన, అంగళ్లు, పుంగనూరు ఘటనలకు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ నోటీసుల వ్యవహారం రచ్చగా మారిన తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తనను రేపో మాపో అరెస్టు చేస్తారని వ్యాఖ్యానించటం ఆ పార్టీలోని నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి.