NationalNewsNews Alert

దేవ దేవ ఓటరు దేవా.. నమో నమ:

ఓటరు కన్నెరుపెక్కిన
మాటలతో దానినార్ప మంత్రుల తరమా ?
పోటెత్తిన సంద్రమ్మును
ఈటెలతో నణచగలడె యీశుండైనన్
..

సహజ కవులు సరసమైన భాషలో ఓటరు మనోగతాన్ని వివరించిన తీరిది. ఓటరుకు ఆగ్రహం వస్తే అంతే సంగతులు. పార్టీలు బోర్టు తిప్పాల్సిందే. పెట్టేబేడా సద్దుకుని వెళ్ళాల్సిందే. వారి ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు. వారి మనోగతాన్ని ఎవరూ గ్రహించలేరు. గుట్టు చప్పుడు కాకుండా ఈవీఎంలో మీట నొక్కేసి.. పార్టీల తలరాతలు మార్చగల అపర బ్రహ్మలు వారు. వారి జోలికెళితే ఇక అడ్రస్ గల్లంతైనట్టే. పోటెత్తుతున్న సముద్రాన్ని ఈటెలతో ఆపడం ఎంత కష్టమో.. ఓటరు నాడిని పసికట్టడం కూడా అంతే కష్టం. అది ఈశ్వరుడి వల్ల కూడా కాదేమో. ఎన్ని గుళ్ళు తిరిగినా.. ఎంత మంది దేవతలకు మొక్కినా .. ఫేట్ తిరగరాయాలని ఓటరు అనుకుంటే ఆ దేవుళ్ళు కూడా ఏం చేయలేరు. అందుకే దేవుళ్ళలో ఓటరు దేవుళ్ళది ఓ ప్రత్యేక స్ధానం. విడి రోజుల్లో దేవుళ్ళను పట్టించుకోనట్టే .. ఓటర్లను ఎవరూ పట్టించుకోరు. కష్ట కాలంలో దేవుళ్ళకు మొక్కినట్టే.. ఎన్నికల సమయంలో కాళ్ళ మీద పడ్డం, వారి ప్రసన్నత కోసం నానా తంటాలు పడ్డం చూస్తూ ఉంటాం. ఇక రానున్న రోజులన్నీ వారితోనే పని. వరుస పెట్టి మొక్కులు తీర్చుకునే వారు .. పొర్లు దండాలు పెట్టే వారు.. పొగిడి పొగిడి ప్రసన్నం చేసుకునే వారు నిత్యం తారసపడుతూనే ఉంటారు. నమ్మి ఓటేస్తే నిండా మునిగినట్టే. నమ్మక దూరం పెడితే నష్ట పోయినట్టే. ఓటరుకు ఇదో పరీక్ష. ఏ పార్టీ ఏం చేయాలనుకున్నా ముందుగా ఓటరును నమ్మించాలి. ఆ నమ్మకం గెలవాలి. గెలిచి అధికారం చేపట్టాలి. ఆ తర్వాత గుర్తుంటే ఓటరు సంగతి ఆలోచించాలి. ఇదీ ఇప్పుడు జరుగుతున్న తంతు. దేవుడి గుడికి వెళ్ళాలంటే పెద్దగా హంగామా ఉండదు కానీ .. ఓటరు దేవుడిని కలవాలంటే హంగూ ఆర్భాటం అన్నీ ఉండాల్సిందే. అప్పుడే ఆయన చూపు పడేది. ఆయన్ని అబ్బో అనిపిస్తేనే అందలం దక్కేది. అందులోనూ చవితి కాలం. ఇక ఆ గణపతిని.. ఈ ఓటరును ఆకర్షించాలంటే ఇదే తగిన సమయం. జై గణేష్ మహరాజ్ కీ.. జై ఓటరు సాబ్ కీ..


ఎన్నికలూ తరుముతున్నాయి. వరస పెట్టి పండగలూ వచ్చేస్తున్నాయి. ఆ గణపతిని అడ్డం పెట్టుకుని ఈ ఓటరు దేవుడిని ఆకర్షించేందుకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. తమ పార్టీ రంగులతో మండపాలను సిద్ధం చేశాయి. కార్లో ఎక్కిన గణపతి .. సైకిల్ మీద శంకర సుతుడు.. కమలంలో లంబోదరుడు.. రైతు వేషంలో, నేత వేషంలో ఇలా నానా రకాల వేషాలు కట్టి బొజ్జ గణపయ్యలను వేదికల మీదకు ఎక్కిస్తున్నారు. తమ పార్టీ గుర్తులు ప్రధానంగా కనిపించేట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరికి సుత్తులు.. కొడవళ్ళు కూడా ఆయన చేతుల్లో పెట్టేస్తున్నారు. కలం పట్టిన చేత కత్తులు పట్టిస్తున్నారు. ఓరి.. నీ పూజ పాడుగాను అని గణపతే అనుకునేట్లు చేస్తున్నారు. ప్రచారానికి ప్రచారం.. భక్తికి భక్తి. ఏం ప్లాన్ రా బాబూ.. అని ఆ వినాయకుడే ముక్కు మీద వేలుసుకునేలా చేస్తున్నారు. ఇదే సమయంలో దేవుడుకి దణ్ణ మెట్టుకుందామని మండపం గడపదొక్కితే .. అన్నా జరా.. యాదుంచుకో అంటూ ఓ చిరునవ్వు పడేసి .. చిన్న దండమెట్టేసి ఓటరు దేవుడిని దువ్వే పనులు కొనసాగుతున్నాయి. ఆ స్వామీ కరుణించాలి.. ఈ స్వామీ కరుణించాలి. వారి చల్లని చూపు పడితేనే మెల్లగా కుర్చీ పట్టుకోగలిగేది. అందుకే నేతలందరూ కలిసి సమయము.. సందర్భము కలిసి వచ్చింది కాబట్టి ..ఉప ఎన్నిక జరిగే మునుగోడును ఓ పుణ్య క్షేత్రంలా మార్చేశారు. కారు పార్టీ వాళ్ళు, కాంగ్రెస్సోళ్ళు, కమలం గుర్తు వాళ్ళు అంతా వినాయకుణ్ణి వదిలేసి ఓటరు దేవుడినే ప్రార్ధిస్తున్నారు. పాపం.. వారి పేర్లన అష్టోత్తరాలు, శతనామావళులు లేవు కాబట్టి సరి పోయింది. లేకపోతే అవీ చదివి.. ఛీ .. వీళ్ళ బాష పాడుగాను అనుకునేట్లు చేసేవారే. ఇక ఆ దేవుడి మీద.. ఓటరు స్వామి మీద.. అపార నమ్మకం పెట్టుకున్న బీజేపీ .. ఈ ఎన్నికల్లో కారు గుర్తొళ్ళు ,ఇంటికి కిలో బంగారం ఇచ్చినా, కార్లు బంగళాలు ఎర చూపినా గెలిచేది మేమే .. మా కమలమే అంటోంది. అదీ వాళ్ళకు ఓటరు దేవుడి మీద ఉన్న అపార నమ్మకం. గణపతి దేవుడి మీద భక్తి.


ఇదంతా ఒకెత్తు. ఇక గెలిచి పీఠం ఎక్కాక మరొక ఎత్తు. చవితి పండగ చుట్టూ రాజకీయాలు నడిపే నేతల తీరు కూడా ఇప్పుడు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మండపాలకు అనుమతులు ఇవ్వకుండా కావాలని రాజకీయాలు చేయడం.. విద్యుత్ ఛార్జీలు రెట్టింపు చెయ్యడం వంటి పనులు ఏపీ కమలనాధుల కన్నెర్రకు కారణమైంది. ఇది ఆ దేవుడినే కాదు.. ఓటరు దేవుళ్ళ మనోభావాలకు ఇబ్బంది కలిగించమే అంటూ ఫ్యాన్ గుర్తు నేతలపై పొగలు కక్కారు. నిరసనలకూ దిగారు. విఘ్నాలు తొలగించే ఆ దేవుని పండక్కే విఘ్నాలు కల్పించడమేంటి? అస్సలు అనుమతులే తీసుకోం ఏం చేస్తారో చేసుకోండంటూ.. దీపావళి రోజున అంటించే థౌజండ్ వాలా టైపులో పేలి పోతున్నారు. మండపాల చుట్టూ అంటుకుంటున్న విమర్శల మంటలను ఆర్పేందుకు అటు జగన్ సర్కార్ కూడా రెడీ అయ్యింది. మండపాలకు రుసుములు వసూలు చేస్తున్నాం అనడంలో అర్ధం లేదు .. ఆ గణపతి మీద ఒట్టు అంటున్నారు అమాయకంగా దేవాదాయశాఖ వ్యవహారాలు చూస్తున్న అధికారులు. ఏదైనా కవ్వించాలి.. రెచ్చగొట్టాలి.. పొగబెట్టాలి.. చివరికి ఏదో ఘనకార్యం చేశామన్నట్లు చల్లార్చాలి. ఇవన్నీ రాజకీయంగా మామూలే అనుకోవచ్చు. కానీ దేవుళ్ళు ఊరుకుంటారా. ఆ.. గణపతి ఊరుకున్నా ఓటరు దేవుళ్ళకు కసి రేగిందంటే .. కన్నెర్ర చేశారంటే పీఠాలే తారుమారు కాకమానవూ.


ఆయుధ పూజకు దసరా వరకు ఏం ఆగుతాం అనుకున్నారో ఏమో. ఇక పాత మిత్రులంతా చవితి పండగ నాడే తమ ఆయుధాలను సరి చేసుకుంటున్నారు. అస్త్ర శస్త్రాలతో కమలంపై దాడికి గణపతి సాక్షిగా రెడీ అయ్యేందుకు అన్నీ సర్దుకుంటున్నారు. ఇప్పటికే హర్యానా వేదికగా ప్రయత్నాలు చేస్తున్నారు. పైకి మొక్కక పోయినా .. మనసులోనే ఆ బొజ్జయ్య గణపయ్యను స్మరించుకుని బీజేపీపై యుద్ధానికి సిద్ధం అంటున్నారు. మహా కూటమిని ఏర్పరిచి .. రానున్న ఎన్నికల్లో ఓటరు దేవుళ్ళ ముందుకు వెళ్ళేందుకు ఓ ప్రణాళికను తయారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం లాలూ పంచన సేదతీరుతున్న నితీష్, ఆయన రాకతో ఓ కొండంత ధైర్యం వచ్చిందని భావిస్తున్న లాలూ, ఆప్ చేతిలో పంజాబ్ లో దెబ్బతిన్న అకాలీలు, యూపీలో అధికారం కోసం తాపత్రయ పడుతున్న అఖిలేష్, అధికారం నుండి ఎక్కడ తమను బీజేపీ లాగి పడేస్తుందోనని భయపడుతున్న అరవింద్.. ఇలా అందరినీ జత కట్టి, జమ కట్టి కొత్త పోరుకు సిద్దమంటూ సిగ్నల్ ఇస్తున్నారు. మొత్తానికి చవితి దేవుడు తమను చల్లగ చూడాలని.. కరుణించి ఆశీర్వదించాలని నేతలు కోరుకుంటున్నారు. మరి.. ఈసారి ఓటరు దేవుళ్ళ కరుణ వారి మీద ఎలా ప్రసరించబోతోందో చూడాలి.