పోలీసుల అత్యుత్సాహం, చలో విజయవాడ ఉద్రిక్తం
పూలే విగ్రహం నుంచి నిరసన ప్రదర్శన, సీపీఐ, దళిత, మైనార్టీ నేతల అరెస్ట్
నాలుగేళ్ల నుంచి దళిత, మైనార్టీలపై హత్యాకాండ
మానవతా విలువలు మరచిన సీఎం జగన్ అంటూ సీపీఐ రామకృష్ణ మండిపాటు
దళితులు, మైనార్జీలపై దాడులను నిరసిస్తూ సీపీఐ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన చలో విజయవాడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి సీపీఐ, దళిత, మైనార్టీ, ప్రజా సంఘాల నేతలు పూలమాలలేసి నివాళులర్పించి.. చలో విజయవాడ పూలే విగ్రహం దగ్గర నుంచి శాంతియుతంగా ప్రదర్శనతో బయల్దేరగా, ఒక్కసారిగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టులు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జల్లి విల్సన్‌తో సహా తదితరులను పోలీసులు వ్యాన్లలోకి నెట్టేసి, గవర్నరు పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు తాడేపల్లిలోని తన ఇంటి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి బయల్దేరిన సీపీఐ నేత రామకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. చలో విజయవాడకు వెళ్లేది లేదంటూ ఆటంకాలు సృష్టించారు. పోలీసుల వలయాన్ని దాటుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుటకు రామకృష్ణ రాగా, ఆయనకు తోడుగా సీపీఐ, దళిత, మైనార్టీ ప్రజా సంఘాల నేతలు చేరుకుని కొంతసేపు నిరసనకు దిగారు.

రాష్ట్రంలో నాలుగేళ్ల నుంచి దళిత, మైనార్జీలపై జరుగుతున్న హత్యాకాండలపై ఈ నిరసనలు చేపట్టామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇటీవల సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడపలో జిల్లా స్థాయి అధికారి పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ దళిత డాక్టర్ అచ్చెన్నను హత్య చేస్తే, సీఎం బాధిత కుటుంబ సభ్యులను కనీసం ఫోన్లో కూడా పరామర్శించలేదని మండిపడ్డారు. హంతకులతో పోలీసులు కుమ్మక్కయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ను మానసికంగా వేధింపులకు గురిచేసి, హింసించి ఆయన చనిపోవడానికి వైసీపీ ప్రభుత్వం కారణమయ్యిందన్నారు. వైసీపీ ఎమ్మల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపి శవాన్ని డోర్ డెలీవర్ చేసిన ఘటనలో ఎమ్మెల్సీకి అధికార పక్షం పూలరంగులు వేస్తున్నారేగాని, అసంతబాబుపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదని తప్పుపట్టారు. కర్నూలు జిల్లా ఎర్రవాడలో మైనార్టీ యువతిని ఘోరంగా మాన భంగం చేస్తే… ఆ హంతకులు ఇప్పటికి ఊళ్లో తిరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నంద్యాలలో అబ్దల్ సలామ్ కు చెందిన నలుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు పోలీసులే కారణమని మండిపడ్డారు. వాటన్నిటిపైనా సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

