మాజీ మంత్రిని అడ్డుకున్న పోలీసులు.. ఎర్రబెల్లి మాస్ వార్నింగ్..
తెలంగాణలోని జనగామ జిల్లా దేవరుప్పలలో ఇవాళ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డా.బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేవరుప్పలలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో విగ్రహావిష్కరణకు అనుమతి లేదంటూ పోలీసులు ఎర్రబెల్లిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అంబేడ్కర్ వాదులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త ఘర్షణగా మారి తీవ్ర ఉద్రిక్తతతకు దారితీసింది. అంబేడ్కర్ వాదులు పోలీసులను తొసుకుంటూ ఎర్రబెల్లిని విగ్రహావిష్కరణ చేసేందుకు తీసుకెళ్లారు. విగ్రహావిష్కరణ చేసిన అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు మరీ ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారెందుకని ప్రశ్నించారు. తాను విజృంభిస్తే మీరు ఎందుకూ అక్కెరకు రారని మాస్ వార్నింగ్ ఇచ్చారు. వందశాతం బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఏజెంట్లుగా పనిచేసిన అధికారులను వదిలేది లేదని స్పష్టంచేశారు.

