Home Page SliderNational

పంజాబ్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసిన పోలీసులు

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్, అతని సహాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు శనివారం ఆపరేషన్ ప్రారంభించడంతో పంజాబ్ అంతటా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రాడికల్ సిక్కు నాయకుడు, ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ గత కొన్ని వారాలుగా పంజాబ్‌లో హింసను ప్రేరేపిస్తున్నాడని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అమృత్‌పాల్ సహాయకులలో ఒకరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మద్దతుదారులు గత నెలలో అమృత్‌సర్ శివార్లలోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌లో పోలీసులతో ఘర్షణకు దిగారు. శనివారం జలంధర్‌లో అమృతపాల్‌కు చెందిన ఆరుగురు సహాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ మద్దతుదారులు కొందరు పోలీసులు తమను వెంబడిస్తున్నారని పేర్కొంటూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పంజాబ్‌లో ఆదివారం వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంటర్నెట్ సస్పెండ్ చేయబడినందున, పంజాబ్ పోలీసులు శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవాలని, నకిలీ వార్తలు లేదా ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని పంజాబ్ పోలీసులు ట్వీట్ చేశారు. “పంజాబ్ ప్రాదేశిక అధికార పరిధిలో ప్రజా భద్రత దృష్ట్యా అన్ని మొబైల్ ఇంటర్నెట్ సేవలు, అన్ని SMS సేవలు (బ్యాంకింగ్ & మొబైల్ రీఛార్జ్ మినహా) & మొబైల్ నెట్‌వర్క్‌లలో అందించబడిన అన్ని డాంగిల్ సేవలు, వాయిస్ కాల్ మినహా, ఆదివారం అర్ధరాత్రి వరకు నిలిపివేస్తున్నాం.” అని ప్రభుత్వం తెలిపింది.

పంజాబ్‌లో నాటి బింద్రన్‌వాలేను గుర్తు చేస్తున్న అమృతపాల్ సింగ్ అసలు ఎవరు?

2022లో ప్రమాదంలో మరణించిన దీప్ సిద్ధూ ఏర్పాటు చేసిన వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ వివాదాస్పద నాయకుడిగా గుర్తింపు పొందాడు.

ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో చంపబడిన బింద్రన్‌వాలే తరహాలో 29 ఏళ్ల యువకుడు దుస్తులు ధరించి.. అభిమానులతో బింద్రన్‌వాలే 2.0 అని పిలిపించుకుంటున్నాడు.

అమృతపాల్ సింగ్ 2022లో భారతదేశానికి వచ్చి వారిస్ పంజాబ్ దే పగ్గాలు చేపట్టాడు. ఇంతకు ముందు దుబాయ్‌లో ఉద్యోగం చేసేవాడు.

అమృతపాల్ సింగ్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయుధాల ధరించిన మద్దతుదారులతో బయట కన్పిస్తాడు.

అమృత్‌పాల్ అమృత్‌సర్ జిల్లాలోని బాబా బకాలా పట్టణంలోని జల్లు-పూర్ ఖైరా గ్రామానికి చెందినవాడు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఖలిస్తానీ నాయకుడు వార్నింగ్ ఇచ్చాడు. “ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వనని అమిత్ షా చెప్పారు. ఇందిరా గాంధీ కూడా అదే చేశారు. మీరు కూడా అదే చేస్తే అందుకు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘హిందూ రాష్ట్రం’ డిమాండ్‌ చేస్తున్న వారికి నేను ఒక్కటే చెబుతాను. ఆయన హోం మంత్రిగా ఎలా కొనసాగుతారో చూస్తా” అని అమృతపాల్ సింగ్ అన్నారు.