పోలీసులు.. నిస్వార్థ సేవకు రూపాలు
పోలీసులు నిస్వార్థ సేవలకు ప్రతిరూపాలని బళ్లారు ఐజీపీ బీ.ఎస్.లోకేష్‌కుమార్ అభివర్ణించారు.
హోస్‌పేట: పోలీసులు నిస్వార్థ సేవలకు ప్రతిరూపాలని బళ్లారి ఐజీపీ బి.ఎస్.లోకేష్‌కుమార్ అభివర్ణించారు. విజయనగర జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లా సాయుధ బలగం ప్రాంగణంలో నిర్మించిన పోలీసు అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఏటా అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఆచరిస్తున్నారు. విజయనగరలో ఒకరోజు ముందుగా స్మారకాన్ని ప్రారంభించడం అర్థపూర్ణమైన కార్యక్రమం అని కొనియాడారు. మూడు నెలల్లో ఏసీ శ్రీహరిబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్మారకాన్ని నిర్మించారని అభినందించారు. ప్రజలు, పోలీసుల నడుమ మంచి సంబంధాలు ఉన్నప్పుడే శాంతి, భద్రతల పరిరక్షణ సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. హోస్‌పేట శిల్పకళాకారులే పోలీసు అమరవీరుల స్మారకాన్ని చెక్కడం గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు హెచ్.ఆర్.గవియప్ప, ఎస్‌పీ బి.ఎల్.శ్రీహరిబాబు, డీఎస్పీలు టి.మంజునాథ్, డాక్టర్ వెంకటప్ప నాయక, మాలతేశ్ కూనబేవు, స్మయోర్ కంపెనీ ఎండీ బహిర్జి ఎ.ఘోర్పడే పాల్గొన్నారు.