NationalNews

ప్రపంచమంతా నిద్రించినా మేల్కొనేవాడు పోలీస్ ఒక్కడే..!


◆ ప్రజల కోసం జీవించి, మరణించే అమరులు
◆ శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కాపలా

నేడు పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా మన సర్కార్ ప్రత్యేక కథనం

ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ – పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకి, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం.


అక్టోబర్‌ 21, అంటే పోలీసు అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఆ రోజును పురస్కరించుకుంటూ, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్‌ యోధుల త్యాగాలను స్మరించుకుందాం. దేశ సరిహద్దుల్లో సైనికులు అమరులైన రోజు ఇది. 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పదిమంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. వారి స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్న ఈ అమరవీరుల సంస్మరణకు నేటితో సరిగ్గా 63 ఏళ్లు.

ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే పోలీసుల విధులు విభిన్నం. వీరికి పని గంటలతో సంబంధం ఉండదు. నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రతిక్షణం ఆలోచించాల్సిందే. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు అందరినీ పరిగణనలోకి తీసుకొంటే 80 శాతం మంది తలనొప్పి, బీపీ, మధుమేహం, మెడ, వెన్నునొప్పి ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. హోంగార్డు, కానిస్టేబుల్‌, హెడ్‌కానిస్టేబుళ్ల పరిస్థితి మరీ దారుణం.

డ్యూటీకి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు విరామం లేకుండా పనిచేయాల్సిందే. బందోబస్తు డ్యూటీల్లో పాల్గొనేవారి పరిస్థితి సరేసరి. సిబ్బంది కొరత కారణంగా సెలవులు మంజూరుకాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రోజూ సగటున 100మంది కి పైగా సిబ్బంది అనారోగ్యంతోనే విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. ట్రాఫిక్‌ డ్యూటీలు నిర్వహించే సిబ్బంది కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ట్రాఫిక్‌ సిబ్బంది అనారోగ్యకర వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నందున ప్రభుత్వం వారికి అదనపు వేతనం చెల్లిస్తున్నా సరైన ఆరోగ్య పరీక్షలు లేనికారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్ని సమస్యల మధ్య సమాజానికి ఇంత సేవ చేస్తున్న పోలీసులను గౌరవించడం మనందరి బాధ్యత.