Andhra PradeshHome Page Slider

‘పోలవరం’ పాపం చంద్రబాబుదే- జగన్ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు హయంలో పోలవరం నిధులను యధేచ్ఛగా దోచేసారని ఆరోపణలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. పోలవరం ప్రాజెక్టుపై ‘ఎల్లో మీడియా’ అబద్దపు ప్రచారాలు చేస్తోందని, స్వయంగా ప్రధానే, పోలవరంను చంద్రబాబు ‘ఏటీయం’గా వాడుకున్నారని చెప్పారని, ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని ఎద్దేవా చేశారు. పోలవరాన్ని వైయస్సార్ ప్రారంభించారని, పోలవరం అంటే వైయస్సార్ అనీ, ఆయన వల్లే పోలవరం రూపు దాల్చిందని తెలియజేశారు. 1995 నుండి 2019 వరకూ చంద్రబాబు పవర్‌లో ఉన్న కాలంలో పోలవరం ఊసే లేదని విమర్శించారు. పోలవరం  ‘స్పిల్‌వే’ పూర్తి కాకుండా ‘కాఫర్ డ్యాం’ పనులు ఎలా మొదలు పెట్టారని, ‘కాఫర్ డ్యామ్‌’లో పెద్దపెద్ద గుంతలు పడ్డాయని, ఇదంతా చంద్రబాబు బుద్దిలేని పనుల వల్లేనన్నారు. గోదావరి ప్రవాహాన్ని ముందుగా ‘స్ఫిల్‌వే’తో కట్టడి చేసి, ఎగువవైపు ‘కాఫర్ డ్యాం’ను పూర్తి చేసి ఉండాలన్నారు.  

దీనివల్లే గోదావరి వరదలకు నీరు సరిగ్గా ప్రవహించక డ్యాంను ముంచెత్తి, నీరు స్పీడ్‌గా వచ్చి ‘డయాఫ్రం వాల్‌’ను  పాడు చేసిందన్నారు. దీనితో ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి వచ్చిందని,  కేవలం డబ్బు సంపాదన కోసమే పోలవరం పనులు అసంపూర్తిగా చేసారని, తాము ‘రివర్స్ టెండరింగ్’ ద్వారా 800 కోట్ల రూపాయలు ఆదా చేశామని జగన్ పేర్కొన్నారు.