మరో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం… క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో క్యాన్సర్ ఆసుపత్రులను నిర్మించి అందరికీ చికిత్స అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. తాజాగా.. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో 660 కోట్ల రూపాయలతో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. పంజాబ్‌లోని న్యూ చండీగఢ్‌లో నిర్మించిన హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించనున్నారు. దాదాపు రూ.660 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని నిర్మించింది. ఈ క్యాన్సర్ ఆసుపత్రిని కేంద్రం 300 పడకల సామర్ధ్యంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించింది. దీనిలో శస్త్రచికిత్స, మెడికల్ ఆంకాలజీ – కెమోథెరపీ , రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి చికిత్సలతోపాటు పరిశోధనలు చేయనున్నారు.

కాగా.. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లవలసి వస్తోంది. బటిండా ప్రాంతం నుంచి వెళ్లే ఒక రైలును క్యాన్సర్ రైలు అని పిలుస్తారంటే.. సమస్య ఎలా ఉందో ఒకసారి అర్ధంచేసుకోవచ్చు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ముఖ్యమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. న్యూ చండీగఢ్‌లోని ఈ ఆసుపత్రి క్యాన్సర్ కేర్‌కు కేంద్రంగా పని చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. 2018లో సంగ్రూర్‌లో నిర్మించిన 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి సైతం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ఆసుపత్రి పొరుగు రాష్ట్రాల రోగులకు కూడా చికిత్స అందిస్తోంది.

ఇదిలాఉంటే.. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రధాన క్యాన్సర్ ఆసుపత్రులను ప్రారంభించారు. 2022 ఏప్రిల్ 28న దిబ్రూఘర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో దేశంలోని ఏడు క్యాన్సర్ ఆసుపత్రులను ప్రజలకు అంకితం చేశారు. ఈ క్యాన్సర్ ఆసుపత్రులు దిబ్రూఘర్, కోక్రాఝర్, దర్రాంగ్, బార్పేట, తేజ్‌పూర్, లఖింపూర్, జోర్హాట్‌లలో నిర్మించారు. దీంతోపాటు మరో ఏడు కొత్త క్యాన్సర్ ఆసుపత్రులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. అంతకుముందు..ప్రధాని జనవరి 7న కోల్‌కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండవ క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ ఆసుపత్రిని 460 పడకల సామర్ధ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు.