NationalNews

ప్రపంచ వాతావరణ పరిరక్షణకు మిషన్ లైఫ్ ప్రారంభించిన మోదీ

గుజరాత్: మనసర్కార్

పర్యావరణ పరిరక్షణను ఒక సామూహిక ఉద్యమంగా మార్చే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడిన మిషన్ లైఫ్ (LIFE-lifestyle for the environment) ను గుజరాత్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు. కోవడీయాలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధానితో పాటు ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కూడా ఈ మిషన్‌లో పాల్గొన్నారు. భూమిని వాతావరణ మార్పుల వలన కలిగే వినాశకరమైన పర్యవసానాల నుండి కాపాడేందుకు భారత్ ముందడుగు వేసింది. ఈ వాతావరణ మార్పుల పై ప్రభుత్వాలు, ప్రజలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. వాతావరణ మార్పులతో ప్రపంచ ప్రజలంతా దుష్ప్రభావాలను అనుభవించాల్సి వస్తోందని, మనవంతుగా జీవన విధానంలో మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉదాహరణకి జిమ్‌కు వెళ్లేటప్పుడు సైకిల్ వాడడం, ఏసీని 20 డిగ్రీల పైన పెట్టుకోవడం వంటివి వాతావరణానికి మేలుచేస్తాయన్నారు. హిమాలయాలు కరుగుతున్నాయని, జీవనదులు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ మిషన్ లైఫ్ కొన్ని మార్పులను అరికట్టగలదని ఆశాభావం వ్యక్తం చేసారు. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అనే పద్దతులు భారత సంస్కృతిలో ఉన్నాయని, వాటిని తిరిగి పునరుద్దరించుకోవాలని ప్రధాని సూచించారు.

UNO ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ మాట్లాడుతూ జీ 20 దేశాలు 80 శాతం గ్రీన్ హౌస్‌ను విడుదల చేస్తున్నాయని, ప్రపంచ జీడీపీలో 80 శాతం వాటాను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళిని స్థిరమైన జీవితం వైపు నడిపించే శక్తి, ప్రకృతిని రక్షించే సామర్థ్యం ఈ దేశాలకు ఉందన్నారు. ఈ మిషన్ లైఫ్ ప్రారంభంపై ప్రపంచ దేశాలు భారత్‌ను మెచ్చుకున్నాయన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రధాని మోదీకి సందేశం పంపించారు. దానిలో డియర్ ప్రైమ్ మినిష్టర్ నరేంద్రకు నమస్తే అంటూ రాశారు. ఈ మిషన్ విజయం సాధించేలా ఫ్రాన్స్ కూడా కలిసి పనిచేస్తుందన్నారు. బ్రిటన్, జార్జియా, మడగాస్కర్ వంటి దేశాలు భారత్‌ను ప్రశంసించాయి. ప్రధాని మోదీ ఈ విషయంలో చూపిన చొరవను ఆ దేశాలు అభినందించాయి.