Andhra PradeshHome Page Slider

లోకేష్ పాదయాత్రకు ప్లాన్ రెడీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు యవగళం పేరిట ఈ నెల 27 నుంచి కుప్పం వేదికగా పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర సాగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు రోజులపాటు లోకేష్ పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను ఆ పార్టీ నేతలు రెడీ చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు టీడీపీ అధిష్టానం ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసింది. పాదయాత్రకు అవసరమైన అనుమతుల కోసం టీడీపీ నేతలు పోలీసు ఉన్నతాధికారులు దరఖాస్తు చేయడం జరిగింది. అయితే యాత్రకు ఇప్పటివరకు అనుమతి లభించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పంలో సైతం పోలీసులు అడ్డుకోవడంతో లోకేష్ పాదయాత్రకు సైతం ఇదే విధమైన ఇబ్బందులు ఉంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎన్ని ఆంక్షలు నిర్బంధాలు ఉన్న పాదయాత్రను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన వ్యూహాలను చంద్రబాబు స్వయంగా రచిస్తూ నేతలకు అవసరమైన సూచనలు సలహాలను ఇస్తున్నారు. ఇంకోవైపు ఆంక్షలపై న్యాయ పోరాటం చేస్తున్న టీడీపీ సుప్రీంకోర్టు ,హైకోర్టు ఇచ్చే తీర్పు పై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే హైకోర్టు, జీవోను తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇంకా కేసు హైకోర్టు పరిధిలో విచారణ దశలో ఉండగానే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.