Breaking NewsBusinesshome page sliderHome Page Slider

భారీ అంచనాలతో ఐపీఓకు ఫోన్‌పే రెడీ

ఇంటర్నెట్ డెస్క్ : వాల్మార్ట్ నేతృత్వంలోని ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెబీ సూచించిన మార్పులు, చేర్పులకు అనుగుణంగా అప్డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హేరింగ్ ప్రాస్పెక్టస్ ను ఫోన్‌పే త్వరలోనే సమర్పించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఐపీఓ ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పూర్తి ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఐపీఓ:
ఫోన్‌ పే ఐపీఓ పూర్తిగా ‘ఆఫర్ ఫర్ సేల్’ రూపంలోనే జరగనుంది. అంటే, ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ఉండదని స్పష్టమైంది. దీని అర్థం, ఐపీఓ ద్వారా కంపెనీకి నేరుగా కొత్త నిధులు సమకూరవు. ప్రధానంగా పెట్టుబడిదారులకు ఎగ్జిట్ అవకాశాన్ని కల్పించడమే ఈ ఐపీఓ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
యూపీఐ మార్కెట్‌ రారాజు :
డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఫోన్‌ పేకు తిరుగులేని స్థానం ఉంది. దేశంలోని మొత్తం యూపీఐ లావాదేవీల్లో సుమారు 45 శాతం ఫోన్‌ పే ద్వారానే జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం, 2025 డిసెంబరు నెలలో ఒక్క నెలలోనే 9.8 బిలియన్ లావాదేవీలను ఫోన్‌ పే ప్రాసెస్ చేసింది. ఇది భారతీయ డిజిటల్ ఎకానమీలో ఫోన్‌ పే బలాన్ని స్పష్టంగా చాటుతోంది.
ఆదాయం, వ్యాపార వృద్ధితో విశ్వాసం :
ఫోన్‌ పే ఆర్థిక పనితీరు కూడా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. గత ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ రూ.7,115 కోట్ల ఆదాయం నమోదు చేసింది. యూపీఐ చెల్లింపులతో పాటు, బీమా, మ్యూచువల్ ఫండ్స్, బిల్ పేమెంట్స్, క్రెడిట్ సేవల విస్తరణతో వ్యాపారాన్ని విభిన్నంగా విస్తరించింది. ఈ బలమైన వ్యాపార మోడల్‌ నే ఐపీఓకు ప్రధాన ఆకర్షణగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.