కోడి కత్తి కేసులో హాజరు మినహాయింపు కోసం సీఎం జగన్ పిటిషన్
కోడి కత్తి కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా ఎన్ఐఏ కోర్టులో విచారణకు హాజరు కాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని అడ్వొకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో సాక్ష్యం తీసుకునేలా ఆదేశించాలని ఘటనపై తదుపరి దర్యాప్తును చేయాలని ఎన్ఐఏ కోర్టును జగన్ కోరారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై విశాఖపట్టణం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేసిన కేసులో సీఎంతో పాటు ఆయన పీఏ నాగేశ్వర్ రెడ్డి సాక్షులుగా విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు గత విచారణలో ఆదేశాలు జారీ చేసింది. విచారణ షెడ్యూల్ సైతం ఖరారు చేసింది. సోమవారం సీఎం జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అయ్యేందుకు మినహాయింపు కావాలని సీఎం తరపు న్యాయవాది కోర్టును కోరారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతోపాటు, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాలు సమీక్షలు ఉంటున్నాయని కోర్టుకు తెలిపారు. సీఎం కోర్టుకు హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయన్నారు. అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించి అతని సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని న్యాయమూర్తిని కోరారు. ఈ పిటిషన్ల పై విచారణ జరిపిన న్యాయమూర్తి షెడ్యూల్‌ను రద్దు చేశారు. నిందితుడిని, ఎన్ఐఏ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 13 కు వాయిదా వేశారు. 13న ఈ పిటిషన్ ల పై విచారణ జరిపి వ్యక్తిగత హాజర మినహాయింపు పై నిర్ణయం తెలుపుతామన్నారు.

