“మోదీ గుజరాత్‌కు లడ్డూ..తెలంగాణాకు పిప్పరమెంట్ ఇచ్చారు”:హరీశ్
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణాలోని వరంగల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వరంగల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. కాగా ఈ ప్రసంగంలో మోదీ తెలంగాణా సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణాలో కేసీఆర్ సర్కార్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మోదీ ఆరోపించారు. అయితే వీటిపై తెలంగాణా ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కాగా హరీశ్ మాట్లాడుతూ..మోదీ కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి..కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశామని చెప్పుకుంటున్నారని మంత్రి హరీశ్ మండిపడ్డారు. ఈ విధంగా కేంద్రం తెలంగాణా ప్రజలను గత 9 ఏళ్లుగా మోసం చేస్తుందన్నారు. తెలంగాణాలో కోచ్ ఫ్యాక్టరీ వస్తే రూ.20 వేల కోట్లు వచ్చేవి.కానీ ఇప్పుడు వ్యాగన్ ఫ్యాక్టరీ ద్వారా రూ.500 కోట్లే ఇచ్చారని హరీశ్‌రావు తెలిపారు. దీంతో తెలంగాణాకు లడ్డూ దొరకాల్సిన చోట.. పిప్పరమెంట్ ఇచ్చారన్నారు. కాగా మోదీ లడ్డూ మాత్రం గుజరాత్‌కు ఇచ్చి.. తెలంగాణాకు పిప్పరమెంట్ చేతిలో పెట్టారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.