వైయస్సార్సీపీపై ప్రజల్లో అసహనం పెరిగింది : నారా లోకేష్
వైయస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు దౌర్జన్యాలు అరాచకాలతో రాష్ట్ర ప్రజలలో ప్రభుత్వంపై అసహనం పెరిగిందని రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుతోనే వైఎస్సార్సీపీకి రోజుల దగ్గర పడ్డాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న లోకేష్ తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నాలుగు వేల కిలోమీటర్లు యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సీఎం పీఠం కోసం ప్రజలకు ఎన్నో అబద్ధపు వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాటిని పక్కనపెట్టి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రాష్ట్రంలో తాలిబన్ల పరిపాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం నిషేధం అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ మద్యం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.