‘ఎంపీగా నేను కాదు మల్కాజిగిరి ప్రజలు గెలిచారు’ -ఈటల
నేడు నియోజక వర్గంలోని మారుతి నగర్ బిల్డర్స్ అసోసియేషన్ మీటింగులో పాల్గొన్నారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. ఆయన ఎంపీగా తాను చేపట్టబోయే కార్యక్రమాలు వివరించారు. “ఎంపీగా నేను కాదు మల్కాజిగిరి ప్రజలు గెలిచారు. 24 ఏళ్ల నుండి మీ కళ్ల ముందు తిరిగిన వ్యక్తిని నేను. అనేక బాధ్యతలు నిర్వహించాను. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే కొట్లాడినా. మల్కాజిగిరి మినీ ఇండియా అని భావిస్తున్నాం. మీరు నాపై ఉంచిన బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తాననే నమ్మకం ఉంది. దేశం నలుమూలల నుండి అనేక రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వచ్చిన వారున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, బిల్డర్లు, వ్యాపారస్తులు వంటి వారు ఇక్కడే స్థిరపడ్డారు. మల్కాజిగిరి సరిహద్దులు మరో పదేళ్లలో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాల కన్నా ప్రజలే పెద్దవారు. ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు. దాతృత్వానికి కొదవలేని ప్రాంతమిది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే, ప్రజలు కూడా మాకెందుకు అనుకుంటారు. కానీ ఏ విపత్తు వచ్చినా సంఘానికి, వ్యవస్థకు ఎంతో నష్టం జరుగుతుంది. ప్రభుత్వానితో పాటు దానిని నివారించవలసిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది.
ఉద్యోగులు ఆఫీసులలో కష్టపడే సమయం కన్నా, రోడ్లపై ఇళ్లు చేరడానికి పట్టే సమయం ఎక్కువయిపోయింది. కనీసం నగరంలో 3 గంటల పాటు రోడ్డుమీదే ఉంటున్నారు. నాయకుడు పనిలో విఫలమయితే సమాజానికే నష్టం జరుగుతుంది. రాజకీయాలు మాకెందుకు అనుకోకూడదు. వ్యవస్థ బాగుంటేనే ప్రజలు బాగుంటారు. నగరంలో కాలుష్యం పెరిగకుండా చర్యలు తీసుకోవడానికి, రోడ్లు బాగుపడడానికి రాజకీయ నాయకుడే కారణం. గత ఎంపీ ప్రస్తుత ముఖ్యమంత్రి తన పని అయిపోయిందన్నట్లు ఈ నియోజకవర్గాన్ని ఇంక పట్టించుకోలేదు. పవర్ ఓరియెంటెడ్ పాలిటిక్స్ కాదు.. పీపుల్స్ ఓరియెంటెడ్ పాలిటిక్స్ కావాలి. నేను ప్రజలకు మేలు చేయడమే కానీ ఎన్నడూ కీడు చేయాలని కలలో కూడా అనుకోను. ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చేది పదవి తప్ప, వారసత్వంగా వచ్చేది కాదు. కార్పొరేటర్, ఎమ్మెల్యే ఏ పార్టీ వారైనా వారితో సమన్వయం చేసుకుంటూ ఈ నియోజకవర్గానికి మేలు జరిపించడానికే ప్రయత్నిస్తాను. మల్కాజిగిరి ప్రజలు ప్రధాని మోదీ మనస్సులో పేరు సంపాదించుకున్నారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగింది. నేషనల్ హైవేలు, ఆసుపత్రులు ఎంతగానో అభివృద్ధి చెందాయి. దేశంలో ఎయిమ్స్ మెడికల్ ఆసుపత్రులు ఎన్నోరెట్లు పెరిగాయి. గతంలో ఎంతగానో ప్రజలకు ఉపయోగపడిన చెరువులు నేడు గుర్రపు డెక్కలతో, దుర్గంధంతో నిండిపోయింది. వాటిని బాగుచేసి కాపాడుకోవలసిన అవసరం మనకు ఉంది. మన సమస్యల కోసం అందుబాటులో ఉండి పరిష్కారాల కోసం ప్రయత్నిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. పార్టీలకు, ప్రలోభాలకు అతీతంగా పని చేస్తానని మాట ఇస్తున్నాను” .