Home Page SliderTelangana

జన ఔషది మందులపై తప్పుడు ప్రచారం చేస్తుండ్రు..

ప్రతి ఒక్కరు జన ఔషధి సేవలు వినియోగించుకోవాలని.. అధిక ఖర్చుల భారం నుండి బయటపడాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ‘జన ఔషధీ దివస్- 2025’ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరిలోని నేరేడ్మెట్ క్రాస్లెడ్లో నిర్వహించిన వాక్ లో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని మందుల కంపెనీలు, ప్రైవేట్ వ్యాపారులు జన ఔషధ కేంద్రాలలో నాణ్యమైన మందులు దొరకవని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవన్ని అవాస్తవమన్నారు. ఔషధాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుందని ఈటల తెలిపారు. ప్రధాని మోడీ పేదరికం తెలిసిన వారే కాబట్టే పేదల కోసం పథకాలు తీసుకువచ్చారన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ 11 ఏళ్లలో పేదలకు అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడంలో మోడీ పాత్ర మాటల్లో చెప్పలేమని ఈటల పేర్కొన్నారు.