విశాఖ గర్జన ర్యాలీ .. భారీగా తరలివస్తున్న ప్రజలు
ఏపీలో రాజధాని రగడ కొనసాగుతూనే ఉంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ఏపీలో మొదటి నుంచే నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకిస్తూ.. అమరావతి రైతులు 1000రోజుల పైగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అమరావతి నుంచి అరసవిల్లి వరకు మహాపాదయాత్రను చేపట్టారు. అయితే ఈ పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి రైతులు అనుమతులు పొందారు. ఈ విధంగా అమరావతి రైతులు అనేక ఆటుపోట్ల నడుమ విజయవంతంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరోపక్క జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తూ..విశాఖలో కొందరు వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు.

విశాఖ ప్రజలు ఈ రోజు మూడు రాజధానుల నినాదంతో విశాఖ గర్జన పేరుతో భారీ ర్యాలీ,బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ ,దక్షిణ కోస్తా నేతలు పాల్గొనున్నారు. విశాఖలోని బీచ్‌రోడ్డులో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నానికి జనసేనాని విశాఖకు చేరుకోనున్నట్లు సమాచారం. అయితే విశాఖ గర్జనకు పోటీగా టీడీపీ సేవ్ ఉత్తరాంధ్ర సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విశాఖ గర్జన కోసం వైసీపీ జేఏసీకి మద్దతు పలికింది. దీంతో ఈ విశాఖ గర్జనలో పాల్గొనేందుకు ప్రజలు విశాఖకు భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతున్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జనం ఈ విశాఖ గర్జన ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.