ప్రజల వద్ద భారీగా బ్లాక్‌మనీ..?
ప్రజలు మళ్లీ డబ్బులు దాచుకుంటున్నారా..? నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ముద్రించిన నోట్లలో బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బును మినహాయిస్తే ఇంకా 30.88 లక్షల కోట్ల రూపాయల నగదు ప్రజల వద్దే పోగై ఉంది. ఇది అక్టోబరు 21వ తేదీ వరకు ఆర్బీఐ తేల్చిన లెక్క అని మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని పన్నులు విధిస్తున్నా ప్రభుత్వం వద్ద కంటే ఎక్కువగా ప్రజల వద్ద బ్లాక్ మనీ జమ కావడం ఆందోళన కలిగిస్తోంది. డబ్బులు చేతులు మారుతూ ప్రభుత్వం వద్దకు ఎక్కువ మొత్తంలో చేరితేనే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. లేకుంటే బ్లాక్‌మనీ పెరిగిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది.

భారీగా నగదు పోగేస్తున్న ప్రజలు..
2016లో ప్రధాని మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినప్పుడు జనం వద్ద ఉన్న రూ.17.97 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి. దీంతో నల్లడబ్బు కాస్తా తెల్లగా మారింది. తర్వాత ముద్రించిన కొత్త నోట్లు ప్రజల వద్దకు చేరాయి. బ్యాంకుల్లో జమ అయిన డబ్బును మినహాయిస్తే ఇంకా భారీ మొత్తంలో నగదు ప్రజల వద్ద ఉంది. ప్రజల్లో చేతులు మారుతున్న డబ్బులు మినహాయించినా కొందరు భారీగానే డబ్బులను బ్లాక్ చేశారనే అనుమానం కలుగుతోంది. ప్రభుత్వం నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించినా.. నగదు లావాదేవీలపై పరిమితి విధించినా జనం నోట్ల కట్టలను పోగేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల బెంబేలెత్తించిన కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు తమ వద్ద నగదు నిల్వ ఎక్కువగా పెట్టుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.