Home Page SliderNational

టీడీపీని ఎన్డీఏ కూటమికి చేరడానికి పవన్ ప్రయత్నాలు

మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీకి హాజరైన పవన్ కళ్యాణ్, టీడీపీ పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చడానికి కృషి చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మీటింగ్ అయిపోయినా కూడా పవన్ ఢిల్లీలోనే పర్యటన కొనసాగించడంపై ఉత్కంఠ నెలకొంది. వరుసగా ముఖ్య నేతలను కలుస్తున్నారు పవన్. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్నదే పవన్ ధ్యేయంగా కనిపిస్తోంది. దీనికోసం టీడీపీని కూడా ఈ కూటమిలో కలుపుకోవడానికి తిప్పలు పడుతున్నారు పవన్ కళ్యాణ్. బీజేపీ ఏపీ ఇన్ ఛార్జ్ మురళీధరన్‌తో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు పవన్. రాజకీయాలలో ఏమైనా జరగొచ్చని పవన్ చెప్పేశారు. దీనితో తెలుగుదేశం, బీజేపీ మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పొత్తుల గురించి జాతీయ  నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని పురంధరేశ్వరి ఇప్పటికే ప్రకటించారు. దీనితో ఈ కూటమిలోకి టీడీపీని తీసుకురావడానికి సర్వవిధాల ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. టీడీపీని కలుపుకుంటేనే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి చెక్ పెట్టగలమని బీజేపీకి చెప్పి ఒప్పించే అవకాశం ఉంది. ఢిల్లీ నుండి రేపు మంగళగిరి చేరుకున్న తర్వాత ఆయన భేటీ వివరాలు తెలియజేసే అవకాశం ఉంది.