మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 20న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన పార్టీ ని బీజేపీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తెలుగువారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పలుమార్లు ప్రచారంలోకి పవన్ కల్యాణ్ ను తీసుకొచ్చారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే కాకుండా.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపేందుకు ఎన్డీయే కూటమి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తెలుగు వారు అత్యధికంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.