సమస్య చెబితే పరిష్కరించేందుకు కృషి చేస్తా అన్న పవన్
తాండూరు: యువకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెబితే.. వారి వద్దకు వెళ్లి.. మాట్లాడి పరిష్కరిస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం తాండూరులో బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్‌గౌడ్ విజయాన్ని కోరుతూ నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు రంగు నోట్లతో నడుస్తున్న ప్రస్తుత పరిస్థితిలో సభకు అభిమానులు, కార్యకర్తలు నిస్వార్థంగా వచ్చారని చెప్పారు. తాండూరులో భూ, ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడాలంటే మార్పు రావాలని చెప్పారు. తాండూరులో పోటీచేస్తున్న ప్రధాన అభ్యర్థులు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు వ్యయం చేస్తున్నారని ఆరోపించారు. నాగర్ కర్నూల్ జనసేన అభ్యర్థి లక్ష్మణ్‌గౌడ్ మాట్లాడుతూ బహుజనుల పాలన కోసం బీజేపీ, జనసేన కృషి చేస్తామని చెప్పారు. బీజేపీ మద్దతు తెలిపిన జనసేన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పవన్ ప్రసంగం ముగించే సమయంలో జై తెలంగాణ.. జై భారత్.. జైహింద్ అని నినాదాలు చేశారు.

