మహా ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రభావం
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ప్రభావం మహా ఎన్నికలపై బాగానే పడింది. ఆయన పర్యటించి, బీజేపీకి మద్దతు పలికిన ప్రాంతాలలో బీజేపీ ముందంజలో ఉండడం విశేషం. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికలలో తనదైన ముద్ర వేశారు. ఆయన పుణె, బల్లార్ పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్‌లలో ప్రచారం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్‌లో పుణె, బల్లార్ పూర్, షోలాపూర్‌లలో బీజేపీ ముందజలో ఉంది. పవన్ తన ప్రచారంలో సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడారు. ఆయా ప్రాంతాలలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉండడం విశేషం. ఆయా ప్రాంతాలలో సనాతన ధర్మాన్ని గురించి ప్రస్తావించడం, హిందువులను ఆకర్షించడంలో విజయం సాధించారు. శివసేన పార్టీ పేరు నుండే ఆదర్శంగా తీసుకుని తన పార్టీ పేరును జనసేనగా పెట్టినట్లు చెప్పారు.