ఏపీ అధికారులను హెచ్చరించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కార్యకర్తల్లా కొందరు అధికారులు పనిచేస్తున్నారంటూ… అలాంటి వారిని వదిలేది లేదని హెచ్చరించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ప్రజలు అన్నీ సునిశితంగా పరిశీలిస్తున్నారని తెలియజేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల గౌడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాలనా తీరుపై చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో జస్టిస్ గోపాల గౌడ ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోతో పాటుగా పవన్ కళ్యాణ్ తన స్పందనను తెలియజేశారు. గౌరవనీయులైన జస్టిస్ గోపాల గౌడ ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న వికృత పాలనపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని ప్రతి అధికారి తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలని వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్న, ప్రతి ప్రభుత్వ అధికారిని ప్రజలు గమనిస్తున్నారని… ఆ విషయాన్ని వారు మరిచిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు.