పవన్ కల్యాణ్ చికిత్స కోసం హైదరాబాద్‌కు…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్యలు కొనసాగుతున్నాయి. గత వారం నుండి ఆయనకు వైరల్ ఫీవర్ సోకగా, దగ్గు తీవ్రంగా ఉండడంతో పూర్తిగా విశ్రాంతిలోనే ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో జ్వరంతో ఉన్నప్పటికీ సభా కార్యక్రమాలు, అధికారిక విధుల్లో పాల్గొన్న పవన్ అప్పటి నుండి పరిస్థితి మరింత విషమించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నిరంతర జ్వరంతో పాటు దగ్గు తగ్గకపోవడంతో పవన్‌ను అమరావతి నుంచి హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన సొంత వాహనంలోనే వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, అవసరమైతే గన్నవరం నుంచి విమానంలో హైదరాబాద్‌కి ప్రయాణం కానున్నట్లు సమాచారం. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
గత నాలుగు రోజులుగా పవన్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదని పార్టీ స్పష్టం చేసింది. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లో మరింత విశ్లేషణాత్మక పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు పవన్ హాజరు కాలేకపోతున్నారు. మరోవైపు ఆయన తాజా చిత్రం ఓజీ భారీ విజయాన్ని సాధించినప్పటికీ, ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కడా సందడి చేసే పరిస్థితి లేదు. గత వారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో వర్షంలో పాల్గొన్న పవన్ ఉత్సాహంగా కనిపించినప్పటికీ, అప్పటి నుంచి జ్వరం తీవ్రతరమైందని తెలుస్తోంది.
జనసేన వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కల్యాణ్ శుక్రవారం మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి, అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందనున్నారు.