Andhra PradeshHome Page Slider

అమిత్ షాతో చర్చించేందుకు ఢిల్లీకి పవన్, సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన చర్చలు

టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తు లెక్కలు తేల్చేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో వస్తున్న అడ్డంకులను తొలగించే బాధ్యతను టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అప్పగించారు. రెండు వారాల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు-కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీలో పొత్తులపై చర్చించారు. అయితే మొత్తం వ్యవహారంపై క్లారిటీ రాలేదు. టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది, జనసేన పరిస్థితేంటన్నదానిపై అమిత్ షా క్లారిటీ కోరినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఒక అవగాహనకు వచ్చిన పవన్ కల్యాణ్.. ఏపీలో మూడు పార్టీల మధ్య సీట్ షేరింగ్ వ్యవహారంపై అమిత్ షాకు వివరించనున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సర్కారును ఓడించాలని, టీడీపీ-బీజేపీ-జనసేన సర్కారు ఏర్పడాలని పవన్ కల్యాణ్ గత కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఏపీలో మళ్లీ జగన్ వస్తే.. వామ్మో అనుకునేలా పరిస్థితులున్నాయని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పొత్తులో భాగంగా 35 ఎమ్మెల్యేలు, 9 ఎంపీలను బీజేపీ, జనసేన పార్టీలకు ఇస్తుందన్న ప్రాధమిక సమాచారం ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఢిల్లీ నుంచి కాల్ వస్తే, వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీట్ల సర్దుబాటు విషయంలో చర్చించేందుకు టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ నేతలు ఇవాళ విజయవాడ నోవాటెల్ లో భేటీ కానున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నదానిపై క్లారిటీ రాగా.. తాజాగా ఏఏ సీట్లలో ఎవరు కంటెస్ట్ చేస్తే ఫలితాలు ఎలా వస్తాయన్నదానిపై నేతలు చర్చించనున్నారు.